కొరడాతో కొట్టుకుంటూ దీపావళి వేడుకలు!

దీపావళి అంటే.. ఇళ్ల ముందు దీపాలు, రంగురంగుల విద్యుత్ కాంతులు, టపాసులు కాల్చుతూ ఆనందంగా జరుపుకొంటారు. మనకు తెలిసిన దీపావళి వేడుకలు ఇలాగే ఉంటాయి.

Published : 07 Nov 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి అంటే.. ఇళ్ల ముందు దీపాలు, రంగురంగుల విద్యుత్ కాంతులు, టపాసులు కాల్చుతూ ఆనందంగా జరుపుకొంటారు. మనకు తెలిసిన దీపావళి వేడుకలు ఇలాగే ఉంటాయి. కానీ.. కర్ణాటకలోని ఓ గ్రామంలో మాత్రం.. దీపావళి వేడుకలు వినూత్నంగా జరుపుకొంటున్నారు. కొరడాలతో కొట్టుకుంటూ పండగ చేసుకుంటున్నారు.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా ప్రాంతంలో దీపావళి వేడుకలను వినూత్నంగా జరుపుకొంటున్నారు. ఈ ప్రాంతంలోని కొమరపంతా తెగకు చెందిన ప్రజలు ‘హోందే హబ్బ’ అనే ఓ ప్రత్యేక కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు. పండుగ రోజు ఈ తెగ ప్రజలు ఒకే చోటికి చేరతారు. ఆ తర్వాత వారంతా రెండు గ్రూపులుగా విడిపోయి కొరడాలు, అడవిలో దొరికే హోందే కాయ్‌ అనే చిన్న చిన్న కాయలతో కొట్టుకుంటారు. ‘హోందే హబ్బ’ అని పిలిచే ఈ ఆటలో రెండు వర్గాలూ ఎదురెదురుగా నిలబడి.. హోందే కాయ్‌ కాయలను విసురుకుంటూ వేడుకలు జరుపుకొంటారు. అయితే ఈ ఆట ఆడటంలోనూ కొన్ని నిబంధనలు పాటిస్తారు. ఆటలో పాల్గొనే కొమరపంతా తెగ ప్రజలు కొరడాతో ఎదుటివారిని కోపంతో కొట్టకూడదు. కేవలం ఓ ఉత్సవం మాదిరిగానే దీనిని భావించి ఆడాల్సి ఉంటుంది. కాయలను విసిరినప్పుడు కేవలం ఎదుటి వ్యక్తి మోకాలి కింది భాగంలో తాకే విధంగానే కొట్టాలి. ఈ నిబంధనను ఉల్లంఘించినవారు వెంటనే ఆట నుంచి నిష్ర్కమించాల్సి ఉంటుంది. మధ్యలో గాయాలపాలైనప్పటికీ సంప్రదాయం ప్రకారం సుమారు నాలుగు గంటలపాటు ఆటను కొనసాగిస్తారు. అనంతరం అంతా కలిసి స్థానికంగా ఉన్న వెంకటరమణ దేవాలయంలో పూజలు నిర్వహించి పండుగకు ముగింపు పలుకుతారు. 

కొమరపంతా తెగవారు క్షత్రియ వర్గానికి చెందినవారు. పూర్వం తమ వంశీయులు యుద్ధ నైపుణ్యాల్లో ఆరితేరినవారని.. పలు రాజ వంశాల పాలనలో సైనికులుగా సేవలందించారని కొమరపంతా ప్రజలు చెబుతున్నారు. వీరత్వాన్ని ప్రదర్శించేలా తమ పూర్వీకులు ‘హోందే హబ్బ’ సాహస క్రీడను ఆడేవారని.. ఆ సంప్రదాయాన్ని తామూ కొనసాగిస్తున్నామని తెలిపారు.       


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని