కొవిడ్‌ టెస్ట్‌: నానోఫైబర్‌తో కచ్చితమైన ఫలితం!

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు సాధ్యమైనంత త్వరగా వైరస్‌ను గుర్తించడమే కీలకం. అయితే, ప్రస్తుతం జరుగుతున్న కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో ఒక్కోసారి ఫలితం....

Published : 30 Jan 2021 00:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు సాధ్యమైనంత త్వరగా వైరస్‌ను గుర్తించడమే కీలకం. అయితే, ప్రస్తుతం జరుగుతున్న కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో ఒక్కోసారి ఫలితం తప్పుగా నిర్ధారణ అవుతోంది. వైరస్‌ సోకిన వారిని కచ్చితంగా గుర్తించలేకపోవడం.. వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. అయితే, కొవిడ్‌ టెస్టుల్లో నానో ఫైబర్‌ స్వాబ్‌లను వినియోగించడం వల్ల ఇలాంటి ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ప్రస్తుతం అనుమానిత వ్యక్తి ముక్కు, నోటి నుంచి పొడగాటి స్వాబ్‌ ద్వారా నమూనాలు సేకరిస్తున్నారు. అనంతరం వీటిని ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతి ద్వారా కరోనాకు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2ను గుర్తిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ వ్యక్తి శరీరంలో వైరస్‌ ప్రభావం (వైరల్‌ లోడ్‌) తక్కువగా ఉంటే ప్రస్తుతం వినియోగిస్తున్న స్వాబ్‌ ద్వారా అవసరమైన శాంపిల్‌ సేకరణ ఇబ్బందిగా మారుతోంది. వీటిని అధిగమించేందుకు నూతన స్వాబ్‌లను రూపొందించారు.

ఇందుకోసం ఎలక్ట్రో స్పిన్నింగ్‌ సాంకేతికతతో నానోఫైబర్‌ స్వాబ్‌ను తయారుచేశారు. ఒక సెంటీమీటర్‌ పొడవాటి స్థూపాకారంలో ఉండే స్వాబ్‌ను జెలటిన్‌ (జంతు పదార్థాల నుంచి సేకరించిన ప్రొటీన్) పూత పూసి, ప్లాస్టిక్‌ కర్రకు అమర్చారు. ఇలా రూపొందించిన స్వాబ్‌ శాంపిల్‌ సేకరించే సమయంలో ప్రోటీన్లు, కణాలు, బాక్టీరియాను ఎక్కువ మొత్తంలో గ్రహించడంతో పాటు అదే మొత్తంలో విడుదల చేస్తాయి. ఇలా తయారు చేసిన స్వాబ్‌లను ఇప్పటికే వినియోగిస్తున్న ఇతర స్వాబ్‌లతో పోల్చి చూడగా, నానోఫైబర్‌ స్వాబ్‌ల శాంపిళ్లతో తప్పు ఫలితం వచ్చే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 10 రెట్ల తీవ్రత తక్కవగా ఉన్నప్పటికీ సార్స్‌కోవ్‌-2ను కచ్చితంగా గుర్తించగలుగుతున్నట్లు వెల్లడించారు. ఈ విధమైన శాంపిల్‌ సేకరణతో కేవలం కరోనా వైరస్‌ కాకుండా ఇతర వ్యాధులు, క్రైమ్‌ సంఘటనల్లో ఫోరెన్సిక్‌ నిపుణులు తీసుకునే శాంపిళ్ల వంటి సమయాల్లోనూ కచ్చితమైన శాంపిళ్లకు ఎంతో ఉపయోగపడుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని