అక్కడ రూ.10కే వైద్యం

ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు ఆస్పత్రికి పరుగులు పెడతారు. ప్రస్తుతం వైద్యం మరింత ప్రియంగా మారిన వేళ.. ప్రైవేటులో లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పీర్జాదిగూడలో ఓ వైద్యుడు కేవలం 10 రూపాయలకే వైద్యం చేస్తున్నారు.

Published : 03 Jun 2021 01:18 IST

హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో పేదలకు ఓ వైద్యుడి సాయం

ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు ఆస్పత్రికి పరుగులు పెడతారు. ప్రస్తుతం వైద్యం మరింత ప్రియంగా మారిన వేళ.. ప్రైవేటులో లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పీర్జాదిగూడలో ఓ వైద్యుడు కేవలం 10 రూపాయలకే వైద్యం చేస్తున్నారు. నిరుపేదలు, రైతులు, స్వాతంత్ర్య సమరయోధులు, అనాథలు, యాసిడ్ బాధితులకు తక్కువ ఖర్చుకే చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ కష్టకాలంలోనూ తన సేవలు కొనసాగిస్తున్నారు.

ఈయన పేరు డాక్టర్‌ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌. హైదరాబాద్‌ పీర్జాదిగూడలో నాలుగేళ్ల నుంచి ప్రజ్వల క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. అక్కడ వచ్చే నిరుపేదలకు రూ.10 చెల్లిస్తే చాలు వైద్యం చేస్తున్నారు. అంతేకాదు, ఔషధాల్లో 10 శాతం రాయితీ, వైద్యపరీక్షల్లో 30శాతం రాయితీ ఇచ్చి అండగా నిలుస్తున్నారు. నాడీ పట్టకుండానే రూ.500 నుంచి రూ. 1500 వరకు కన్సల్టేషన్‌ ఫీజు వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులు ఉన్న ఈ రోజుల్లో ఇమ్మాన్యుయేల్‌ పది రూపాయలకే వైద్యం చేయడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా తన వద్దకు వచ్చేవారి నుంచి ఆయన రూ.200 ఫీజు తీసుకుంటారు. డబ్బులున్న వారి దగ్గర పూర్తి మొత్తం తీసుకుంటారు. కానీ నిరుపేదలకు అతితక్కువ ధరకే వైద్యం అందిస్తామని ఇమ్మాన్యుయేల్‌ తెలిపారు. ఆ ఉద్దేశంతోనే క్లినిక్‌ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 

ఆర్థికంగా వెనుకబడ్డవారు, తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారు, దేశానికి అన్నం పెట్టే రైతన్న, స్వాతంత్ర్య సమరయోధులు, అనాథలు, దివ్యాంగులు, యాసిడ్‌ బాధితులు.. వీరందరికి రూ.10 ఫీజు తీసుకుంటారు. జవాన్లు, వారి కుటుంబసభ్యులకు ఫీజు లేకుండా చికిత్స అందిస్తారు. వైద్య చికిత్సతో పాటు ల్యాబ్‌ టెస్టులకు సాధ్యమైనంత తక్కువ ధరలు తీసుకుంటూ వైద్యం చేస్తారు. సాధారణ రోగులతో పాటు కొవిడ్‌ రోగులకు పది రూపాయలకే వైద్యం అందిస్తున్నారు. కరోనా మొదటిదశలో పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌సెంటర్‌లో సుమారు 400 మందికి పైగా చికిత్స చేసినట్టు ఇమ్మాన్యుయేల్‌ తెలిపారు. రెండోదశ ఉద్ధృతిలోనూ బాధితులకు చేయూతనందిస్తున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉండి, తీవ్రత ఎక్కువ ఉన్నవారికి ఇళ్ల వద్దకే సిబ్బందిని పంపించి చికిత్సనందిస్తున్నామని చెప్పారు. ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పెడుతున్నామని వివరించారు. కొవిడ్‌ ప్రారంభమయ్యాక కూడా ఇంతకుముందులాగే క్లినిక్‌ను సేవా దృక్పథంతోనే నడుపుతున్నామని అన్నారు.  కొవిడ్‌ రోగులకూ అదే పది రూపాయలతోనే వైద్యం అందిస్తున్నారు. కరోనా ఉద్ధృతి ఉన్నా లేకున్నా పేదలకు రూ.10 తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే ఓ ఆసుపత్రిని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అందులో అన్ని రకాల సదుపాయాలను పేదలకు ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని