Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 20 Jan 2022 12:57 IST

1. ఏపీలో కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపు

ఏపీలో ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఓ వైపు ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపునకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్‌ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సీఎఫ్‌ఎంఎస్‌ సిద్ధం చేసింది.

2. పీఆర్సీపై పోరాటం.. ఏపీ వ్యాప్తంగా రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. మరోవైపు కలెక్టరేట్ల ముట్టడితో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నాయకులను బుధవారం రాత్రి నుంచి అడ్డుకుంటున్నారు.

3. ఉద్యోగులూ.. వాళ్ల ట్రాప్‌లో పడొద్దు: చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

ఏపీ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ఉద్యోగుల సమస్యలపై కచ్చితంగా చర్చలు జరుపుతుందని.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఇది కాదని చెప్పారు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనల నేపథ్యంలో అమరావతిలో శ్రీకాంత్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

4. డ్రగ్స్‌ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ అరెస్టు

డ్రగ్స్‌ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. నైజీరియాకు చెందిన టోనీని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముంబయిలో అరెస్టు చేశారు. మంబయి కేంద్రంగా మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్న టోనీ.. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ముంబయిలో టోనీని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 

5. స్టార్‌ సింగర్‌ రాలేదని అభిమానుల రచ్చ

గాయకుడు ఖేసరి లాల్‌ యాదవ్‌.. ఓ లైవ్‌షోకు అనుకున్న సమయానికి రాలేదని అభిమానులు రచ్చ రచ్చ చేశారు. తీవ్ర ఆగ్రహంతో వందల కుర్చీలు, వాహనాలకు నిప్పంటించారు. వేదికను కూడా ధ్వంసం చేశారు. నేపాల్‌లోని సున్సారి జిల్లా బుర్జ్‌లోని విరాట్‌నగర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. 

6. కొత్త కేసులు 3 లక్షలు దాటేశాయి

దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. దాంతో కొత్త కేసులు భారీగా పెరిగి, మూడు లక్షల మార్కును దాటేశాయి. తాజాగా 19 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,17,532 మంది వైరస్ బారినపడ్డారు. ముందురోజు కంటే 12శాతం అధికంగా కొత్త కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 15శాతం నుంచి 16.41 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తోంది. 

7. బ్రిటన్‌లో ఇక మాస్క్‌ తప్పనిసరి కాదు.. ఆంక్షల ఎత్తివేత దిశగా..

ఒమిక్రాన్‌ ఉద్ధృతితో విలవిల్లాడిన ఐరోపా దేశం బ్రిటన్‌.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. గత కొన్ని రోజులుగా అక్కడ కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఒమిక్రాన్‌ కట్టడి కోసం అమలు చేస్తున్న అదనపు ఆంక్షలను సడలించాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే గురువారం నుంచి ఈ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తాజాగా ప్రకటించారు. 

8. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు పూరీ జగన్నాథ్‌ సూచన

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ చిన్న సలహా ఇచ్చారు. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కేవలం సంస్థకు పెట్టే పేరు, మార్కెటింగ్‌ మాత్రమే కాకుండా..  ఆ టౌన్‌షిప్‌ బోర్డు కూడా భారీగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు తాజాగా ఆయన ‘హాలీవుడ్‌’ అంశంపై ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

9. అతడిని జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్‌ సమస్య తీరినట్టే!

టీమ్‌ఇండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 0-1తో వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో మంజ్రేకర్‌ స్పందించాడు.

10. మిరామ్‌ తరోన్‌ ‘కిడ్నాప్‌’.. చైనా బలగాలతో ఆర్మీ సంప్రదింపులు..!

అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడిని చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వస్తోన్న వార్తలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ ఉదంతంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. అదృశ్యమైన యువకుడి కోసం చైనా బలగాలతో హాట్‌లైన్‌ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణశాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని