Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 26 Jan 2022 20:59 IST

1.అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి.. వైకాపా నేతల ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కొత్త జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాల అంశంపై అక్కడక్కడా విమర్శలు చెలరేగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ వైఖరిని రాజంపేట మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మర్రి రవి తప్పుబట్టారు. రాజంపేట ప్రజలను సంప్రదించకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలనుకోవడం సరికాదన్నారు.

2.ఈ నెల 28న శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు టైం స్లాట్‌ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. తితిదే అధికారిక వెబ్‌సైట్లో టికెట్లను పొందవచ్చని తితిదే తెలిపింది.

3.మన చర్మంపై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు బతికి ఉంటుంది?

రెండేళ్లు దాటినా కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచ దేశాలను నీడలా వెంటాడుతూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, గామా వేరియంట్లుగా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా.. తాజాగా ఒమిక్రాన్‌ రూపంలో విరుచుకుపడుతోంది. గతంలో వచ్చిన వేరియంట్లన్నింటి కన్నా దీని ప్రభావం తక్కువే అయినా.. మనుషుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వేరియంట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Flying Car: అక్కడ ఎగిరే కార్లకు అనుమతి వచ్చేసింది!

4.ఈయన మనసు విలువైన ‘వజ్రం’.. అందుకే వరించింది ‘పద్మం’

సేది వజ్రాల వ్యాపారం.. అందుకేనేమో ఆయన మనసు కూడా ఆ వజ్రమంత విలువైనది. తాను ఈ స్థాయికి రావడానికి కష్టంతో పాటు తన కింద పనిచేసే ఉద్యోగుల కృషి కూడా ఉందని భావించే ఆయన.. ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సిబ్బందికి ఖరీదైన కానుకలు అందిస్తున్నారు. అందుకే ఆయన మంచి మనసుకు ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. ఆయనే గుజరాత్‌కు చెందిన సావ్జీ ఢోలాకియా..!

5.భారత ఐటీ కంపెనీల ‘బ్రాండ్‌’ బాజా!

అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో రెండు భారత్‌కు చెందినవే కావడం విశేషం. అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక కంపెనీ ఐబీఎంను సైతం మన దిగ్గజాలు వెనక్కి నెట్టాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఏటా కంపెనీల బ్రాండ్‌ విలువను అంచనా వేసే ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌’ నివేదిక బుధవారం వెలువడింది.

6.తిరగేసిన జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి.. రాజీనామాకు భాజపా డిమాండ్‌!

గణతంత్ర దినోత్సవం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కేరళ రాష్ట్ర మంత్రి ఒకరు తిరగేసి కట్టిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీనిపై రాజకీయంగా దుమారం రేగింది. విపక్ష భాజపా.. మంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేసింది. ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌కు చెందిన అహ్మద్‌ దేవర్‌కోవిల్‌ ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కాసర్‌గోడ్‌ మున్సిపల్‌ స్టేడియంలో బుధవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు.

NTR Trust: కరోనా రోగులకు సేవలు విస్తృతం చేసిన ఎన్టీఆర్ ట్రస్టు

7.రైలును తగులబెట్టిన అభ్యర్థులు.. ఇంతకీ వివాదం దేనికి?

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్​ఆర్​బీ) పరీక్షల్లో అక్రమాలపై బిహార్​లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. గయలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన ఉద్యోగార్థుల్లో కొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆగిఉన్న ఓ రైలును రాళ్లు, కర్రలతో ధ్వంసం చేసి ఆపై నిప్పంటించారు. ఇదిలా ఉంటే పరీక్షల్లో అవకతవకలపై అభ్యర్థుల ఆందోళనల దృష్ట్యా.. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ)తో పాటు లెవల్-1 పరీక్షలను నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

8.అభిమానులకు కప్పులు కావాలి... ర్యాంకులు కాదు: మంజ్రేకర్‌

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్‌, విశ్లేషకుడు సంజయ్‌ మంజ్రేకర్ మద్దతు తెలిపాడు. విరాట్‌ను తొలగించి రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ నిర్ణయం సరైందేనని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ట్రోఫీని నెగ్గలేకపోవడమే కోహ్లీపై వేటుకు కారణమని పేర్కొన్నాడు. అభిమానులు ప్రపంచకప్‌లను గెలవాలని కోరుతున్నారని, అందుకే కోహ్లీని తప్పించి రోహిత్‌కు బాధ్యతలను బీసీసీఐ అప్పగించి ఉంటుందని విశ్లేషించాడు.

9.ఐసీసీ టీ20 ర్యాంకులు.. ఆ జాబితాల్లో భారత్ నుంచి ఒక్కరూ లేరు

టీ20 అత్యుత్తమ బౌలర్లు, ఆల్‌రౌండర్ల విభాగంలో టీమ్‌ఇండియా ఆటగాడు ఒక్కరు కూడా టాప్‌-10లో లేకపోవడం గమనార్హం. టాప్‌ బౌలర్ల జాబితాలో లంకకు చెందిన వహిందు హసరంగ (797), షంసి, అదిల్ రషీద్‌, ఆడమ్ జంపా, రషీద్‌ ఖాన్‌ వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. ఆల్‌ రౌండర్ల జాబితాలో అఫ్గాన్‌ ఆటగాడు మహమ్మద్‌ నబీ తొలి ర్యాంక్‌ సాధించగా.. షకిబ్ అల్ హసన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, వహిందు హసరంగ, మొయిన్ అలీ టాప్‌-5లో స్థానం సంపాదించారు.

10.ఆ ప్రతీకారం వల్లేరిపబ్లిక్‌ డే పరేడ్‌కు నన్ను పిలవలేదు..!

గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన పరేడ్‌కు సీఎం మమతా బెనర్జీ తనను ఆహ్వానించలేదని బెంగాల్‌ ప్రతిపక్ష నేత, భాజపా నేత సువేందు అధికారి అన్నారు. నందిగ్రామ్‌లో తన చేతిలో పరాజయాన్ని మమత ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనచేతిలో ఓటమికి ప్రతీకారంగానే ఈరోజు రెడ్‌ రోడ్‌ పరేడ్‌ ఆహ్వానితుల జాబితా నుంచి తన పేరును తప్పించారని ఆరోపించారు. క్యాన్సర్‌కు కూడా మందు ఉందన్న సువేందు అధికారి.. ప్రతీకారేచ్ఛ స్వభావం, అసూయలకు మాత్రం ఉండదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని