ఇడ్లీ, దోసె.. ఏదైనా ఒక్క రూపాయే!

సాటి మనిషికి ఆకలి తీర్చాలంటే మేడలు, మిద్దెలూ అక్కర్లేదు. మంచి మనసుంటే చాలని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ బామ్మ. తాటి గుడిసెలో రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ పేదల ఆకలి తీరుస్తోంది. డబ్బులో దొరకని.........

Published : 12 Sep 2020 01:31 IST

పేదల ఆకలి తీరుస్తున్న బామ్మ

ఇంటర్నెట్‌డెస్క్‌: సాటి మనిషికి ఆకలి తీర్చాలంటే మేడలు, మిద్దెలూ అక్కర్లేదు. మంచి మనసుంటే చాలని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ బామ్మ. తాటి గుడిసెలో రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ పేదల ఆకలి తీరుస్తోంది. డబ్బులో దొరకని ఆత్మసంతృప్తి ఒకరి కడుపు నింపడంలో దొరుకుతోందని చెబుతోంది ఆ బామ్మ.

తమిళనాడులోని తిరువరూర్- నారమంగళం గ్రామానికి చెందిన కమల పట్టి (85)కి 50 ఏళ్లుగా హోటలే జీవనాధారం. హోటల్ అంటే మన నగరాల్లో నడిపినట్టుగా రంగురంగుల లైట్లు, టేబుళ్లు, డిజైన్లతో కూడిన ప్లేట్లు ఉండవు. పాండయచూర్ నదీ తీరాన.. ఓ చిన్ని తాటాకు గుడిసె ఆమె హోటల్. వెడల్పాటి పచ్చని ఆకులే ఆ హోటల్‌లో ప్లేట్లు. పెద్ద బండరాళ్లే అక్కడ కుర్చీలు, టేబుళ్లు. ఏ హంగూ లేకపోయినా ఇతర హోటళ్లకు లేని ప్రత్యేకత కమలమ్మ హోటల్ సొంతం. అదే.. రూపాయి ఇడ్లీ.

కమలమ్మ హోటల్‌లో ఒక్క రూపాయికే ఒక ఇడ్లీ లేదా దోసె తినొచ్చు. గ్రామంలోని రైతులు, పేదలు.. ఉదయాన్నే ఓ పది రూపాయలు పట్టుకొచ్చి కడుపు నిండా పది ఇడ్లీలు, దోసెలు తిని పొలం పనులకు పయనమవుతారు. అయితే, కరోనా కాలంలో పెరిగిన ధరలు పట్టించుకోకుండా ఇప్పటికీ రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తోంది కమలమ్మ. ఆదాయం కోసం పాకులాడకుండా, అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపుతున్న కమలమ్మకు గ్రామస్థులు సలాం చేస్తున్నారు.

‘‘50 ఏళ్లుగా ఈ బామ్మ ఇక్కడే రూపాయి ఇడ్లీ, దోసె అమ్ముతోంది. నా లాంటి పేదలు కేవలం రూ.10లకే ఆకలి తీర్చుకోవచ్చు. బయట పెద్ద హోటళ్లకు వెళ్తే... ఒక్కో దోసెకు రూ.35-రూ.50 చెల్లిస్తాం. కానీ, ఇక్కడ అలా కాదు’’ అంటున్నాడు ఆ గ్రామస్థుడు. తనకు డబ్బులో లభించని ఆత్మ సంతృప్తి పేదల ఆకలి తీర్చడంలోనే దొరుకుతుందంటోంది కమలమ్మ. అందుకే, రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తానంటోంది. ‘‘మా అమ్మ 50 పైసలకే ఓ దోస/ఇడ్లీ అమ్మి మమ్మల్ని పోషించింది. ఆమె మరణించాక నేను ఈ వ్యాపారం చేపట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నాను. ఒకరి ఆకలి తీర్చితే మనసుకు తృప్తి లభిస్తుంది. ఆ సంతృప్తి ఏ సంపాదన వల్ల వస్తుంది?’’ అంటోంది ఈ ముసలావిడ. నిజంగా ఈమెకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని