Updated : 22/07/2021 20:47 IST

Rains: వణుకుతున్న హైదరాబాద్‌.. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి!

హైదరాబాద్‌: భాగ్యనగరం ఎడతెరపిలేని వానతో నానుతోంది. గత వారం రోజులుగా వర్షం ఏదో ఒక సమయంలో పడుతూనే ఉండగా.. రెండ్రోజులుగా రేయింబవళ్లు చిరు జల్లుల వాన నగరాన్ని వీడటం లేదు. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్‌ వాసులు వణుకుతున్నారు. గతేడాది వరద బీభత్సాన్ని గుర్తుకు తెచ్చుకుని బిక్కు బిక్కుమంటున్నారు.

రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో పరిస్థితి నానబెట్టినట్టుగానే ఉంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లోకి నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, నాలాలను సరిచేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.  గురువారం హైదరాబాద్‌లో 11.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 12.6, మేడ్చల్‌-మల్కాజ్‌గిరిలో 10.6, సంగారెడ్డి జిల్లాలో 8.7, వికారాబాద్‌లో 7.9 మిల్లీమటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పోలిస్తే మోస్తరు వర్షంతో నగరం తడిసిముద్దయింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మణికొండ, మెహదీపట్నం, నాంపల్లి, కోఠి, వనస్థలిపురం, హయత్‌నగర్‌, మేడ్చల్‌ తదితర ప్రాంతాలతో పాటు ఎల్బీనగర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల పరిధిలోనూ ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.

ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రధాన కూడళ్ల వద్ద వెంటనే స్పందించేందుకు డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నాలాలపై ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. భారీ వర్షపాతం నమోదైతే వెంటనే స్పందించేందుకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఎంఎస్‌ మక్తా, సోమాజీగూడ, రాజ్‌భవన్‌ పరిసర ప్రాంతాల్లోని బస్తీల్లో నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలిస్తున్నామని, సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర బృందాలను డివిజన్ల వారీగా సిద్ధం చేశామని మేయర్‌ తెలిపారు. నాగోల్‌, బండ్లగూడ, ప్రశాంత్‌నగర్‌, హస్తినాపురం, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, ముసారాంబాగ్‌ బ్రిడ్జి, పటేల్‌నగర్‌, ప్రేమ్‌ నగర్‌ కాలనీల్లో డ్రెయినేజ్‌లు ఉప్పొంగాయి. మరో వైపు హైదరాబాద్‌ నగర శివార్లలో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండాయి. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదనీరు చేరుతోంది. దీంతో హిమాయత్‌ సాగర్‌ ఐదు గేట్లు, గండిపేట చెరువు రెండు గేట్లు ఎత్తి నీటిని మూసి నదిలోకి వదులుతున్నారు. అధికారులు మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని