Tirumala: తిరుపతి- తిరుమల మధ్య లింకురోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి: తితిదే

రెండో ఘాట్‌ రోడ్‌లో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో తిరుపతి- తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతోందని,  ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు

Updated : 04 Dec 2021 11:06 IST

తిరుమల: రెండో ఘాట్‌ రోడ్‌లో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో తిరుపతి- తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతోందని,  ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు రేపటి నుంచి లింక్‌ రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం అదనపు ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఘాట్‌ రోడ్డులో బండరాళ్లు పడిన ప్రాంతాన్ని దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు  పరిశీలించి అధ్యయనం చేశారని చెప్పారు. ప్రస్తుతం ఒక బండరాయి పడేలా ఉండటంతో దాని పటిష్ఠతను ఐఐటీ నిపుణులు పరిశీలించి ఎలాంటి సమస్య ఉండదని చెప్పారని, ట్రాఫిక్‌ను అనుమతించాలని సూచించారని తెలిపారు. అప్‌ ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించి లింకు రోడ్డు ద్వారా డౌన్‌ ఘాట్‌ రోడ్డుకు వెళ్లేలా తిరుమలకు అనుమతిస్తామని వివరించారు. తద్వారా 75శాతం ఆలస్యాన్ని అధిగమించవచ్చని తెలిపారు. 

కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేసే విషయంపై ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్‌ అధికారులతో తితిదే ఛైర్మన్‌ శుక్రవారం సమావేశం నిర్వహించారని చెప్పారు. పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు ఒక నెల సమయం పడుతుందని నిపుణులు సూచించారని, ఇందుకోసం ఎంతో నైపుణ్యం ఉన్న ఆఫ్కాన్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. ఆఫ్కాన్‌ సంస్థ నిపుణుల బృందం 20 రోజుల్లో డిజైన్‌ సిద్ధం చేయాలని కోరామని, మరో నిపుణుల బృందం ఘాట్‌ రోడ్డులో అన్ని బండరాళ్లను పరిశీలించి సర్వే చేసి మరింత బలంగా మార్చేందుకు యాంకరింగ్‌, ట్రిమ్మింగ్‌ తదితర పనులు చేపట్టాలని సూచించామని తెలిపారు. ఈ మొత్తం పనులు 25 రోజుల్లో పూర్తవుతాయన్నారు. అదనపు ఈవో వెంట సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, దిల్లీ ఐఐటి నిపుణులు కె.ఎస్‌.రావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని