TS NEWS: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల్లో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై..

Updated : 01 Aug 2021 21:21 IST

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల్లో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది.  కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల సమాచారాన్ని అధికారులు కేబినెట్‌ ముందుంచారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని, ఔషధాలు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. కొత్తగా మంజూరైన ఏడు వైద్య కళాశాలల ప్రారంభంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరమే వైద్య కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త వైద్య కళాశాలలకు భవనాలు, హాస్టళ్లు, మౌలికవసతుల కల్పనపై కేబినెట్‌ చర్చించింది. భవిష్యత్‌లో మంజూరయ్యే వైద్య కళాశాలలకు స్థలాలు చూడాలని ఆదేశించింది. 

 కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్‌ ఆదేశించింది. రాష్ట్రంలో అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధానం రూపకల్పన కోసం మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావును నియమించారు. పటాన్‌ చెరులో కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు టిమ్స్‌గా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌, చెస్ట్‌ ఆసుపత్రి ప్రాంగణం, టిమ్స్‌లో, గడ్డిఅన్నారం మార్కెట్‌, ఆల్వాల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అన్ని రకాల వైద్య సేవలు ఒక్కచోటే అందేలా సమీకృత వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ ఏడాది రూ.50వేల లోపు రుణాలు మాఫీ
ఈ ఏడాది రూ.50వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. రుణమాపీ అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఆగస్టు 15 నుంచి ఈనెలాఖరులోపు రూ.50వేల రుణమాఫీని పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్‌ నిర్ణయంతో రూ.50వేల లోపు రుణం తీసుకున్న 6లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు పంటరుణ మాఫీ వివరాలను అర్థికశాఖ అధికారులకు కేబినెట్‌కు అందజేశారు.

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం

కేంద్రం ప్రవేశ పెట్టిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై తెలంగాణ కేబినెట్‌లో చర్చ జరిగింది. రూ.8లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి విద్య, ఉద్యోగాల్లో  రిజర్వేషన్‌ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ వారికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. వానాకాలం పంటల సాగుపై మంత్రివర్గం భేటీలో చర్చ జరిగింది. వర్షాలు, పంటలు, సాగునీరు, ఎరువుల లభ్యతపై చర్చించింది. తెలంగాణలో పత్తికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా పత్తి సాగు పెంచాలని నిర్ణయించింది. పత్తిసాగు పెంపునకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ ఆదేశించింది.

కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌..

వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్ల వారికి తక్షణమే పింఛన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకుంటుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ పద్ధతిని కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్‌ను బదిలీ చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని