GHMC: వణికిస్తోన్న వాన.. కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్‌

వరుణుడి ప్రతాపానికి రాజధాని హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఎప్పుడు ఇళ్లకు చేరుకుంటారో

Updated : 20 Sep 2022 16:17 IST

హైదరాబాద్‌: వరుణుడి ప్రతాపానికి రాజధాని హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఎప్పుడు ఇళ్లకు చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, అసెంబ్లీ ముందు రహదారిపై భారీగా నీరు చేరింది. దీంతో ఎంజే మార్కెట్‌, నాంపల్లి నుంచి అసెంబ్లీ, లక్డీకాపూల్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సైతం ఏం చేయలేక చేతులెత్తేశారు. హైదర్‌గూడ, లిబర్టీ వైపు వెళ్లే మార్గంలో రాకపోకలకు ఆంటంకమేర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మూసారాంబాగ్‌ వంతెనపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ నుంచి కింగ్‌కోఠి వైపు మార్గంలో రోడ్లు జలమయమయ్యాయి. అంబర్‌పేట, కాచిగూడలో నాలాలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. దీంతో  మలక్‌పేట మార్కెట్‌ నుంచి చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి వరకు వాహనాలు నిలిచిపోయాయి. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు మయూరి మార్గ్‌ వద్ద భారీగా నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది.

కూకట్‌పల్లిలో 4అంతస్తుల భవనంపై పిడుగు

కూకట్‌పల్లి వెంకటేశ్వర నగర్లో నాలుగు అంతస్తుల భవనంపై పిడుగుపడింది.ఈ ప్రమాదంలో భవనం గోడలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పెద్ద చెరువులో వ్యక్తి గల్లంతయ్యాడు. మజీద్‌పూర్‌కు చెందిన అనిల్‌ చేపలుపట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. తుర్కయాంజిల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు నుంచి హయత్‌నగర్ వెళ్లే మార్గంలో వరద కాలువ ఉద్ధృతికి ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తుండగా వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాన్ని నియంత్రించలేక వదిలేశారు. చంపాపేట, కోదండరామ్‌నగర్‌, బంజారా కాలనీ, జిల్లెలగూడ, హయత్‌నగర్‌ బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని