TS News: కరోనా పాజిటివిటీ రేటు 0.4శాతానికి తగ్గింది: డీహెచ్‌ శ్రీనివాసరావు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యాక మూడు వేల పాఠశాలల్లో చేసిన కొవిడ్‌ పరీక్షల్లో 195 మంది విద్యార్థుల్లో కొవిడ్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ ...

Updated : 24 Nov 2021 11:10 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యాక మూడు వేల పాఠశాలల్లో చేసిన కొవిడ్‌ పరీక్షల్లో 195 మంది విద్యార్థుల్లో కొవిడ్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో 42 లక్షలమంది ఒక్క డోసు టీకా కూడా వేసుకోలేదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి 8 లక్షల మంది రెండు డోసులు వేసుకున్నారని, ప్రస్తుతం 60 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా పాజిటివ్‌ రేటు చాలా తగ్గిందని, కరోనా మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 0.4 శాతానికి తగ్గిపోయిందని ప్రజారోగ్య సంచాల‌కులు(డీహెచ్‌) శ్రీ‌నివాస‌రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రభుత్వ, 76 ప్రైవేటు కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్‌, 1231 కేంద్రాల్లో రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు జరుగుతున్నాయని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ చికిత్సల కోసం 1,327 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 55,442 పడకలు అందుబాటులో ఉన్నాయని డీహెచ్ శ్రీ‌నివాస‌రావు ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు. ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌, సాధారణ పడకలు అన్నీ కలిపి 2.6 శాతం అంటే 1527 మాత్రమే నిండాయన్నారు. తెలంగాణలో మే 6 నుంచి జ్వర సర్వే కొనసాగుతోందని ఆయన తెలిపారు. మూడోదశలో పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6 వేల పడకలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. వైద్య, పారామెడికల్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 82 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 75 పని చేస్తున్నాయని, మరో 7 ఈ నెలలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు ఏర్పాట్లు చేశామన్నారు. వైద్యారోగ్యశాఖ నివేదిక నేపథ్యంలో కొవిడ్‌ నియంత్రణ చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం అన్నీ చేయలేదని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని