Heavy Rains in Telangana: తెలంగాణలో భారీవర్షాలు.. పలు చోట్ల రాకపోకలు బంద్‌

తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా

Updated : 07 Sep 2021 13:41 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, వరంగల్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. వర్ష బీభత్సానికి ఎక్కడికక్కడ చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే సిరిసిల్ల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. కరీంనగర్‌ నగరంలో ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చి చేరుతోంది.

కామారెడ్డి జిల్లాలోని పిట్లం-బాన్సువాడ మధ్యలో రాంపూర్‌ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది. మద్నూర్‌ మండలం గోజెగావ్‌లోని లెండి వాగుకు భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. డోంగ్లి- మాధన్ హిప్పర్గ మార్గంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్దకు వరదనీరు చేరుకోవడంతో రాకపోకలకు ఆగిపోయాయి. బిచ్కుంద మండలం ఖత్‌గావ్‌-కుర్లా మార్గంలో వరద ప్రవాహానికి రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

జగిత్యాల జిల్లాలోనూ నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లో లెవెల్‌ బ్రిడ్జిల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలుచోట్ల రోడ్డు దెబ్బతినడంతో జగిత్యాల-ధర్మారం, జగిత్యాల-ధర్మపురం, జగిత్యాల-పెగడపల్లి, రాయికల్‌-కోరుట్ల, వేములవాడ-కోరుట్ల మార్గాలను అధికారులు మూసివేశారు. ఆ మార్గాల్లో వెళ్లేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించారు.

వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగులు పారుతూ రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వరదనీరు భారీగా ప్రవహిస్తుండటంతో పంతిని వద్ద నీటి ప్రవాహంలో ఓ లారీ చిక్కుకుంది. ఉప్పరపల్లి చెరువు ఉప్పొంగడంతో అటుగా వెళ్లే రోడ్డు పూర్తిగా వరదముంపులో ఉండిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోని పంటపోలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటమునిగాయి. 

మరోవైపు హుస్నాబాద్‌లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై వరదనీరు చేరింది. అంబేడ్కర్‌ చౌరస్తా, నాగారం రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు పలు వీధులు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షం ప్రభావంతో జమ్మికుంట నుంచి కోరపల్లికి వెళ్లేదారిలో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ ప్రాంతంలో పలుచోట్ల వరదనీరు పంటపొలాల్లోకి చేరడంతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని