Exercise: దృఢత్వం అంటే తీవ్రమైన వ్యాయామం కాదు

దృఢత్వం (ఫిట్‌నెస్‌) అంటే సిక్స్‌ప్యాక్‌ ఉండేలా తీవ్రమైన వ్యాయామం చేయడం, ఆలివ్‌ నూనె వాడడం కాదని బెంగళూరులోని నారాయణ హృదయాలయకు చెందిన ప్రముఖ వైద్యుడు డా.దేవిశెట్టి అన్నారు. చక్కని సౌష్టవంతో కనిపించేందుకు మరీ ఎక్కువసేపు

Updated : 30 Aug 2022 14:40 IST

నారాయణ హృదయాలయ వైద్యుడు డా.దేవిశెట్టి

దృఢత్వం (ఫిట్‌నెస్‌) అంటే సిక్స్‌ప్యాక్‌ ఉండేలా తీవ్రమైన వ్యాయామం చేయడం, ఆలివ్‌ నూనె వాడడం కాదని బెంగళూరులోని నారాయణ హృదయాలయకు చెందిన ప్రముఖ వైద్యుడు డా.దేవిశెట్టి అన్నారు. చక్కని సౌష్టవంతో కనిపించేందుకు మరీ ఎక్కువసేపు వ్యాయామశాలల్లో గడపడం, ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది కాదని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన శనివారం బహిరంగ లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘గత కొద్ది సంవత్సరాలలో నాకు వ్యక్తిగతంగా పరిచయమున్న తొమ్మిది మందిని ఇలాగే కోల్పోయాను. ఫిట్‌గా కనిపించాలని ఎక్కువ వ్యాయామం చేసి 40 ఏళ్ల వయసులోనే వారు మరణించారు.  కనీసం 20 నిమిషాలు మోస్తరు వ్యాయామం చేయాలి. కీటో, మోటోడైట్‌లు కాదు...మీ ప్రాంతంలో లభించే కాలానుగుణమైన పండ్లు, ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవడం, కనీసం ఏడు గంటలు నిద్రపోవడం, ఉత్ప్రేరకాలను వాడకపోవడం, మద్యం, పొగ, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ఉత్తమం. నడక కన్నా ఉత్తమ వ్యాయామం మరొకటి లేదు. సప్లిమెంట్‌ పేరిట ఆహారం, పానీయాల్లో కలుపుకొని తాగే పొడులను విడిచిపెట్టండి. ధ్యానం చేయండి. మీ శరీర అవసరాలను అర్థం చేసుకోండి. నాలుగు పదుల వయసులో శరీరం పలు మార్పులకు గురవుతుంది. వయసు పెరుగుతున్నకొద్దీ మరింత జాగ్రత్త వహించండి. ఒత్తిడిని దూరం చేసుకోండి. బయట ఆరోగ్యంగా కనిపించినట్లు.. శరీరం లోపలా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని లేఖలో డా.దేవిశెట్టి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని