TS News: కొనుగోళ్లలో జాప్యం.. ధాన్యం కుప్పపైనే ప్రాణం విడిచిన రైతు

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతికి కారణమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండె పోటుతో మృతి చెందాడు. తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య అక్కడే నిద్రించాడు...

Updated : 05 Nov 2021 19:05 IST

కామారెడ్డి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతికి కారణమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండె పోటుతో మృతి చెందాడు. తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ధాన్యం కుప్పపైనే ప్రాణాలు విడిచాడు. తెల్లవారుజామున తోటి రైతులు చూసే సరికి చనిపోయి ఉండటంతో అందరూ ఆవేదన చెందారు. రైతు బీరయ్యకు ఎకరం సొంత పొలం ఉండగా.. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. ఇటీవల కోతలు పూర్తి చేసి గత నెల 27న లింగంపేట కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు.

అదే రోజు అక్కడున్న సిబ్బంది సీరియల్‌ నంబర్‌ రాసుకోగా.. బీరయ్య వంతు 70 నంబర్‌ వచ్చింది. వారం రోజుల కిందట లింగంపేట కేంద్రంలో కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే నిన్న, ఈరోజు దీపావళి, అంతకుముందు రోజు వర్షం కారణంగా కాంటా వేయలేదు. ధాన్యం కేంద్రానికి తెచ్చినప్పటి నుంచి రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వస్తోంది. రాత్రిపూట సైతం రైతులు ఆక్కడే నిద్రిస్తున్నారు. ధాన్యం తూకం వేసేందుకు ఒక్కో రైతు 20 రోజులకు పైగా ఎదురుచూడాల్సి వస్తోంది. లింగంపేట కేంద్రానికి మొత్తం 207 మంది రైతులు ధాన్యం తీసుకురాగా.. వారం రోజుల నుంచి కేవలం 23 మందివి మాత్రమే తూకం వేశారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, 3 రోజులు కాంటా బంద్‌ ఉండటంతో మానసికంగా ఆందోళన చెంది బీరయ్య చనిపోయి ఉంటాడని తోటి రైతులు భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా... అన్ని చోట్లా కొనుగోళ్లలో కాలయాపన జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని