TS RTC: నాలుగు నెలల్లో ప్రక్షాళన జరగకపోతే ఆర్టీసీ ప్రైవేటీకరణే

రాబోయే నాలుగు నెలల్లో ఆర్టీసీ ప్రక్షాళన జరగకపోతే ప్రైవేటు పరం చేస్తామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఇదే విషయాన్ని నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం

Updated : 22 Sep 2021 20:43 IST

హైదరాబాద్‌: రాబోయే నాలుగు నెలల్లో ఆర్టీసీ ప్రక్షాళన జరగకపోతే ప్రైవేటు పరం చేస్తామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఇదే విషయాన్ని నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎండీ సజ్జనార్‌, ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌లకు స్పష్టం చేశారు. ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేకసార్లు ఆదుకుందని, ఈ ఏడాది కూడా ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద రూ.3,000 కోట్లు కేటాయించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.  అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

‘‘మరో నాలుగు నెలల్లో ఆర్టీసీని గాడిన పెట్టాలనే లక్ష్యంతో, కృత నిశ్చయంతో ముందుకెళ్లాలి. ఏ రూట్‌లో నష్టాలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?’’ వంటి అంశాలపై అధ్యయనం చేసి వాటిని అమలు పరచాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు తక్షణమే రంగంలోకి దిగి యద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ఆర్టీసీని గాడినపెట్టాలని స్పష్టం చేశారు. కరోనాతో పాటు పెరిగిన డీజిల్‌ ధరలు ఆర్టీసీ నష్టాలకు కారణమైనట్టు అధికారులు సీఎంకు వివరించారు. కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తే కుదరదు...అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలు తెలుసుకోవాలని అప్పుడే సంస్థ బాగుపడుతుందని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఎంతసేపు కార్యాలయంలో కూర్చుని సమన్వయం చేసుకుంటే క్షేత్రస్థాయిలో సమస్యలు ఎవరు తెలుసుకుంటారు. వాటిని ఎవరు పరిష్కరిస్తారు అని ఆర్టీసీ ఈడీ స్థాయి అధికారులను ఉన్నతస్థాయి అధికారులు మందలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరును మార్చుకోవాలని హితవు పలికినట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న 97 డిపోల్లో అన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో అత్యధిక నష్టాలు వస్తున్నాయి. అందుకు గల కారణాలపై నివేదికలు తయారుచేసి, వాటిని లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా కృషిచేయాలని యాజమాన్యం అధికారులకు స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని