Ap News: ప్రభుత్వం దిగిరాకుంటే మరింత తీవ్రంగా రెండో దశ ఉద్యమం: ఉద్యోగ సంఘాల జేఏసీ

ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి కలిసి 71 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. వాటిని వెంటనే నెరవేర్చాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత బొప్పరాజు

Updated : 06 Dec 2021 17:55 IST

కడప‌: ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి కలిసి 71 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. వాటిని వెంటనే నెరవేర్చాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత బొప్పరాజు డిమాండ్ చేశారు. 13 లక్షల మంది డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కడపలో ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి నేతలు మీడియాతో మాట్లాడారు.

‘‘రెండు ఐకాసల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు. 11వ  పీఆర్‌సీ అమలు చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. ఎప్పటికప్పుడు ఇస్తామంటూనే 7 డీఏలు పెండింగ్‌లో పెట్టారు. తమ ప్రభుత్వం రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ చెప్పారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా పెండింగ్‌లోనే ఉంది. వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ జరగడం లేదు. మా సమస్య వినే స్థితిలో ప్రభుత్వం లేదు. అందుకే రోడ్లపైకి రావాల్సి వచ్చింది. మేము దాచుకున్న రూ.1,600 కోట్లు కూడా ఇవ్వలేదు. అడ్వాన్స్ ఇవ్వమని అడిగితే ఇంత వరకు ఇవ్వలేదు. ఉద్యోగుల బిడ్డల వివాహం కూడా వాయిదా వేసుకుంటున్నాం. చివరికి జీపీఎఫ్‌ డబ్బులు కూడా ప్రభుత్వం వద్ద దాచుకోలేని భయం ఉద్యోగుల్లో కలిగింది. ఈ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. రేపటి నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తాం. ప్రతి ఉద్యోగి నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతాం. ఈ నెల 16న అన్ని కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం దిగిరాకుంటే రెండో దశలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం’’ అని తెలిపారు.

నిరసన కార్యక్రమాల్లో మేం పాల్గొనటం లేదు..

పీఆర్‌సీ నివేదిక, అమలు తదితర అంశాలపై ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ప్రకటించింది. పది రోజుల్లోగా పీఆర్సీని ప్రకటిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసినందున తాము ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని పేర్కొంటూ ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, రమణ రెడ్డిలు ప్రకటన విడుదల చేశారు. రేపటి నుంచి ఇరు జేఏసీల ఐక్యవేదిక ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన వద్దంటూ తమ ఉద్యోగులకు అసోసియేషన్ సమాచారం పంపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని