TS News: విదేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన 12మందికి కొవిడ్‌ పాజిటివ్‌

యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముప్పు దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు

Updated : 03 Dec 2021 16:38 IST

హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న వేళ విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారిలో 12 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. నిన్న, ఇవాళ యూకే, కెనడా, అమెరికా, సింగపూర్‌ నుంచి వచ్చిన 12మంది ప్రయాణికులకు కొవిడ్‌-19 సోకినట్టు అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ పాజిటివ్‌గా వచ్చిన 12 మందినీ టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిలో లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. వీరిలో ఒమిక్రాన్‌ నిర్ధారణ కాకపోతే అందరినీ హోం ఐసోలేషన్‌కు పంపనున్నారు.

ఆ మహిళకు ముందు నెగెటివ్‌ అన్నారు.. కానీ పాజిటివ్‌

అలాగే, విదేశాల నుంచి నగరానికి వచ్చిన ఓ మహిళ (36)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ గణేష్‌ నగర్‌ సమీపంలోని రిడ్జ్‌ టవర్స్‌కు చెందిన సదరు మహిళ బుధవారం లండన్‌ నుంచి నగరానికి వచ్చారు. ఆమెకు శంషాబాద్‌ విమానాశ్రయంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే, ఫలితాల్లో నెగెటివ్‌ వచ్చిందని చెప్పి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను ఇంటికి పంపారు. కాసేపటి తర్వాత రిపోర్ట్స్‌ను పరిశీలించిన సిబ్బంది ఆ మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించి జీడిమెట్ల పోలీసులను అప్రమత్తం చేశారు. 

దీంతో సీఐ బాలరాజు వెంటనే రిడ్జ్‌ టవర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గానికి సమాచారం అందించి మహిళకు తెలియజేశారు. అనంతరం అక్కడికి చేరుకొన్న జీడిమెట్ల పోలీసులు జరిగిన విషయాన్ని మహిళకు వివరించి ఆమెను నగరంలోని టిమ్స్‌కు తరలించారు. అక్కడ మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలడంతో ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణ కోసం పంపించారు. మహిళ తల్లిదండ్రులను సైతం హోం క్వారంటైన్‌లో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని