ఫేస్‌బుక్‌పై మరో దేశం నిషేధం!

సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రముఖంగా వినిపించే పేరు ఫేస్‌బుక్‌. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఫేస్‌బుక్‌ను వినియోగిస్తుంటారు. కానీ, చైనా, ఉత్తర కొరియా వంటి కొన్ని దేశాల్లో ఈ ఫేస్‌బుక్‌పై నిషేధం ఉంది. తాజాగా మరో దేశం ఫేస్‌బుక్‌ను నిషేధించాలని

Published : 18 Nov 2020 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రముఖంగా వినిపించే పేరు ఫేస్‌బుక్‌. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఫేస్‌బుక్‌ను వినియోగిస్తుంటారు. కానీ, చైనా, ఉత్తర కొరియా వంటి కొన్ని దేశాల్లో ఈ ఫేస్‌బుక్‌పై నిషేధం ఉంది. తాజాగా మరో దేశం ఫేస్‌బుక్‌ను నిషేధించాలని నిర్ణయించింది. దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో ఉండే వందలాది ద్వీపాల సమూహమే సోలోమన్‌ ఐలాండ్స్‌. ఫేస్‌బుక్‌లో ప్రభుత్వంపై, మంత్రులపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా దీన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా కారణంగా అన్ని దేశాల్లో ప్రజలు, వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. సోలోమన్‌ ఐలాండ్స్‌లోనూ అదే పరిస్థితి. దీంతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే క్రమంలో ప్రభుత్వం.. ఆర్థిక ఉద్దీపన కింద నిధులు విడుదల చేసింది. అయితే ఈ నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా ఆరోపణలు వచ్చాయి. అలాగే ప్రభుత్వం తైవాన్‌ను పక్కనపెట్టి చైనాతో దౌత్య సంబంధాలకు మొగ్గుచూపడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో నెటిజన్లు ఫేస్‌బుక్‌ వేదికగా ప్రభుత్వం తీరుపై, మంత్రులపై మండిపడుతున్నారు. తీవ్ర పదజాలాలతో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ పరిణామాలతో అక్కడి సమాచార, విమానయానశాఖ మంత్రి పీటర్‌ షానెల్‌ అగొవకా ఫేస్‌బుక్‌పై నిషేధం విధించాలని ప్రతిపాదించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్రధానమంత్రితో పాటు మంత్రులందరిపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు వస్తున్నాయని, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగిస్తోందన్న కారణాలు చూపి ఫేస్‌బుక్‌పై ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, దీనిపై ఫేస్‌బుక్‌ సంస్థ ఇంకా స్పందించలేదు. ఆ దేశ ప్రతిపక్షాలు మాత్రం ఫేస్‌బుక్‌పై నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని