Rome's Colosseum: ఇకపై భూగర్భ సొరంగాలనూ చూడొచ్చు..!

ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలోని కలోసియం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలే. గ్లాడియేటర్స్‌గా పిలిచే ప్రాచీన యుద్ధవీరుల

Published : 28 Jun 2021 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలోని కలోసియం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలే. గ్లాడియేటర్స్‌గా పిలిచే ప్రాచీన యుద్ధవీరుల పోరాటాలతో అలనాటి రాజ కుటుంబాలు వినోదం పొందేవి. ప్రేక్షకుల కోలాహలంతో కలోసియం కక్కిరిసిపోయేదని అక్కడి ప్రజలు చెప్పుకొంటారు. రోమన్‌ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కలోసియంలో కొద్ది భాగాన్ని మాత్రమే చూసేందుకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. అందులోని భూగర్భ సొరంగాలను చూసేందుకు అనుమతి ఉండేది కాదు. అయితే కలోసియం చరిత్రలో తొలిసారిగా ఆ సొరంగాలను చూసేందుకూ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఇటలీ సాంస్కృతిక శాఖ మంత్రి డారియో ఫ్రాన్సెషిని వెల్లడించారు. దీంతో పర్యాటకులు, చరిత్రకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశల్లో చేపట్టిన కలోసియం సొరంగాల పునర్నిర్మాణ పనులు ఎనిమిదేళ్లుగా జరుగుతున్నాయి. 80 మంది పురావస్తు శాస్త్ర నిపుణులు, ఇంజినీర్లు కలిసి ఈ పని పూర్తిచేశారు. తాజాగా సందర్శకులను వాటిని చూడటానికి అనుమతిస్తున్నారు.   

కలోసియంలో ప్రేక్షకులు కూర్చునే ప్రదేశం అడుగు భాగంలో 15 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూగర్భ సొరంగాలు, కొన్ని గదులను నిర్మించారు. యుద్ధ కళల్లో సుశిక్షితులైన గ్లాడియేటర్స్‌ పోరాటానికి ముందు వీటిలోనే వేచి ఉండేవారు. సొరంగం తలుపులు తీయగానే వారు యుద్ధభూమిలోకి ప్రవేశించేవారు. సాధారణంగా ఈ సొరంగాల్లో వెలుతురు తక్కువగా ఉండటంతో కొవ్వొత్తులను ఉపయోగించాల్సివచ్చేది. అయితే కలోసియంలో చాలా భాగం ధ్వంసమవడంతో సొరంగాల్లో కొంతమేర స్పష్టంగా కనిపిస్తుంది. కలోసియం మొత్తానికి భూఅంతర్భాగంలో ఉన్న ఈ నిర్మాణాలనే కీలకంగా భావిస్తారు. అందుకే ఇటలీ వీటిని వందల ఏళ్లుగా పరిరక్షించుకుంటూ వస్తోంది.   

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని