Published : 11/05/2021 01:07 IST

ఆప్తులు లేకుండానే తుది మజిలీ..

ముఖం చాటేస్తున్న బంధువులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సోకి మృతిచెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. వారి అంత్యక్రియలకు బంధువులు ముందుకురాని పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైరస్ సృష్టిస్తున్న విలయంతో మానవ సంబంధాలు బీటలువారుతున్నాయి. బయటి వ్యక్తులే దహన సంస్కారాలు నిర్వహించి మృతులను సాగనంపుతున్నారు. కొన్ని కుటుంబాల్లో వరుస మరణాలు తీవ్ర విషాధాన్ని నింపుతున్నాయి. 

అడ్డుకున్న గ్రామస్థులు
కృష్ణా జిల్లా బాపులబాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌ బారినపడి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా అతడి మృతదేహాన్ని ఊర్లోకి తీసుకురాకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులతో చర్చించి అంత్యక్రియలు జరిగేలా ఒప్పించారు. ఎ.కొండూరు మండలం మాధవరం గ్రామంలో కరోనాతో మృతిచెందిన 70 ఏళ్ల వృద్ధుడికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి దహనసంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాక దిక్కు తోచని స్థితితో ఉన్న కుమారుడికి పోలీసులే అండగా నిలిచారు.

ముందుకొస్తున్న యువకులు
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కొవిడ్‌ బారినపడి మృతిచెందినవారి దహనసంస్కారాలు నిర్వహించేందుకు సొంతవాళ్లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కొందరు యువకులు ఆ బాధ్యతను వారి భుజాలపై వేసుకున్నారు. మృతిచెందిన వారి కుటుంబసభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కుటాగుళ్లకు చెందిన ఓ వ్యక్తి, తనకల్లు మండలం బొంతలపల్లికి చెందిన మరో వ్యక్తి మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడవగా అంత్యక్రియల నిర్వహణకు బంధువులు, గ్రామస్థులు ముందుకురాలేదు. యువకులు రంగంలోకి దిగి ఆ పని పూర్తిచేశారు. 

స్వచ్ఛందసంస్థల ఉదారత
కడప జిల్లా కమలాపురంలో బాలాజీ అనే విశ్రాంత రైల్వే ఉద్యోగి మృతిచెందగా బంధువులు ముందుకురాలేదు. దీంతో అతడి భార్య, కుమారుడు స్థానికంగా ఉన్న చారిటబుల్‌ ట్రస్టు వారితో కలిసి దహనసంస్కారాలు నిర్వహించారు. అనంతపురం నగరంలోని టవర్‌ క్లాక్‌ వద్ద ఉన్న చలివేంద్రంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. కరోనాతో మరణించి ఉంటాడనే అనుమానంతో ఎవరూ దగ్గరకు వెళ్లలేదు. పోలీసులు, స్వచ్ఛందసంస్థల నిర్వాహకులు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినవారి అంత్యక్రియలకు చాలా మంది వెనకడుగు వేస్తున్న తరుణంలో మాతృదినోత్సవం రోజునే అమ్మ రుణం తీర్చుకుంది ఓ కూతురు. తెనాలిలోని ఐతా నగర్‌కు చెందిన ఓ మహిళ కొవిడ్‌తో మృతిచెందగా ఆమె అంత్యక్రియలను కన్న కూతురే నిర్వహించింది. 

ఒకే కుటుంబంలో ముగ్గురు.. విషమంగా మరొకరు
సంతోషంగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులోని ఓ కుటుంబంలో నలుగురు కొవిడ్‌ బారినపడగా వారిలో కుటుంబ పెద్దలిద్దరూ మృతిచెందారు. పిల్లలిద్దరూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి ధాటికి రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందారు. ప్రస్తుతం మరొకరి పరిస్థితి విషమంగా మారింది. నెల్లూరు జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ విషాదం కరోనా తీవ్రతను కళ్లకు కడుతోంది. మే 1న తల్లి, మే 4న తండ్రి, మే 6వ తేదీన సోదరి కరోనాకు బలికాగా.. మురళీకృష్ణ అనే వ్యక్తి వైరస్‌తో పోరాడుతున్నాడు. 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని