చర్మం నుంచి స్వాబ్‌తో కొవిడ్‌ పరీక్షలు!

కేవలం చర్మం ద్వారా సేకరించిన నమూనాలతోనే కరోనా వైరస్‌ను గుర్తించవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated : 17 Mar 2021 04:57 IST

బ్రిటన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

లండన్‌: కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేయడంలో వైరస్‌ను గుర్తించడమే ఎంతో కీలకం. మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు భారీ స్థాయిలో చేపడుతున్నారు. ఇందుకోసం ఇప్పటివరకు ముక్కు, గొంతు ద్వారా నమూనాలు తీసుకునే స్వాబ్‌ ఆధారిత ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శరీరంలోకి ఎలాంటి పరికరాలు చొప్పించకుండా కేవలం చర్మం ద్వారా సేకరించిన నమూనాలతోనే కరోనా వైరస్‌ను త్వరగా గుర్తించవచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తేలికగా శాంపిళ్లను సేకరించి కొవిడ్‌ నిర్ధారణ చేయగలిగే పరీక్ష కోసం బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సర్రీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇందుకోసం చర్మం, ముఖం నుంచి వెలుబడే తైల గ్రంథుల (సెబమ్‌) శాంపిళ్లను తీసుకొని పరిశోధించారు. తద్వారా కేవలం వైరస్‌ నిర్ధారణే కాకుండా శరీరంపై వైరస్‌ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పరిశోధనలో భాగంగా, ఆసుపత్రిలో చేరిన 67మంది రోగుల నుంచి సెబమ్‌ శాంపిళ్లను సేకరించారు. వీరిలో 30మంది కొవిడ్‌ నిర్ధారణ అయినవారు కాగా, మరో 37 మందికి నెగిటివ్‌ వచ్చినవారు ఉన్నారు. తైల గ్రంథులు ఎక్కువగా ఉండే ముఖం, మెడ భాగం నుంచి శాంపిళ్లను సేకరించారు. అనంతరం లిక్విడ్‌ క్రోమాటోగ్రఫీ మాస్‌ స్పెక్ట్రోమెట్రీ విధానంలో ఈ శాంపిళ్లను విశ్లేషించారు. తద్వారా నెగెటివ్‌ వారికంటే పాజిటివ్‌ వచ్చిన వారిలో తక్కువ కొవ్వు పదార్థాలు (డైస్లిపిడెమియా) ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాకుండా ఎలాంటి చికిత్స, ఆరోగ్య పరిస్థితిని నియంత్రించినప్పుడు ఈ ఫలితాల్లో కచ్చితత్వం మరింత పెరిగినట్లు గుర్తించారు.

రానున్న రోజుల్లో కొవిడ్‌-19 వ్యాధుల నిర్ధారణ కోసం తేలికైన పద్ధతిని అనుసరించడానికి తమ అధ్యయనం దోహదం చేస్తుందని దీనికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ సర్రీ ప్రొఫెసర్‌ మెలానీ బెయిలీ పేర్కొన్నారు. కొవిడ్‌-19 మానవ జీవక్రియపై ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే తేలిందని, తాజాగా ఆ జాబితాలో చర్మం కూడా చేరినట్లు సహ పరిశోధకులు మ్యాట్‌ స్పిక్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గుర్తించగలిగే కొవిడ్‌ లక్షణాల్లో దీన్ని కూడా చేర్చుకునే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని