Agriculture: ‘కృత్రిమ మేధ’తో రైతుల ఆదాయాన్ని పెంచాలి

వివిధ మార్గాల ద్వారా వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. బిహార్‌ తూర్పు చంపారన్‌ జిల్లాలోని డా.రాజేంద్రప్రసాద్‌ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి...

Updated : 08 Nov 2021 01:29 IST

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

పట్నా: వివిధ మార్గాల ద్వారా వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. బిహార్‌ తూర్పు చంపారన్‌ జిల్లాలోని డా.రాజేంద్రప్రసాద్‌ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి ఈ మేరకు ప్రసంగించారు. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగానికి చాలా అవకాశాలు ఉన్నాయని, రైతులను ఈ దిశగా ప్రోత్సహించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. కరోనా సమయంలో చాలా మంది ప్రజలు నగరాలను వదిలి తమ గ్రామాలకు తిరిగి వచ్చారని, ఈ క్రమంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా వారికి ఇక్కడే ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

కొవిడ్‌ సవాళ్లు ఎదురైనప్పటికీ..

వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ‘సాగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంతో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే అనేక ప్రయోజనాలు పొందుతున్నాయి. వ్యవసాయ ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు భారత్‌ కూడా ఈ తరహా టెక్నాలజీలను వినియోగించాలి’ అని అన్నారు. కొవిడ్‌ సవాళ్లు ఎదురైనప్పటికీ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడాన్ని ప్రశంసిస్తూ.. రైతులకు దేశం చాలా రుణపడి ఉందన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, గవర్నర్ ఫాగు చౌహాన్, ఉప ముఖ్యమంత్రి రేణుదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉప రాష్ట్రపతి.. ఇక్కడి నలంద విశ్వవిద్యాలయంలో ఆరో ధర్మ- దమ్మ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు