మూడురోజుల పాటు పల్స్‌పోలియో

ఆదివారం నుంచి మూడు రోజుల ( జనవరి 31- ఫిబ్రవరి 2 ) పాటు దేశవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శనివారం రాష్ట్రపతి భవన్‌లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Updated : 31 Jan 2021 16:03 IST

ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
పోలియోరహిత దేశంగా పదేళ్లు పూర్తి చేసుకున్న భారత్‌

దిల్లీ: ఆదివారం నుంచి మూడు రోజుల ( జనవరి 31- ఫిబ్రవరి 2 ) పాటు దేశవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ శనివారం రాష్ట్రపతిభవన్‌లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జనవరి 17న నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కానీ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం కారణంగా దీన్ని వాయిదా వేశారు. భారత్‌లో 2011లో చివరిగా గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో పోలియో కేసులు నమోదయ్యాయి.  2014లో ప్రపంచారోగ్య సంస్థ భారత్‌ను పోలియోరహిత దేశంగా ప్రకటించింది.

ఆదివారం నుంచి ప్రారంభమయ్యే పల్స్‌ పోలియో కార్యక్రమానికి సంబంధించి కేంద్రం పలు సూచనలు చేసింది. పోలియో చుక్కలు అందించే కేంద్రాల్లో తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఆరోగ్య కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులతో పాటు వృద్దులు పోలియో కేంద్రాలకు రాకూడదని సూచించారు. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు వారికి ఈ పోలియో చుక్కలు వేస్తారు.

హైదరాబాద్‌లో ఫిబ్రవరి 3 వరకు..
రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పల్స్‌ పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38,31,907 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉండగా.. 23,331 కేంద్రాల్లో పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3 వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

టీకా చాలా సురక్షితం

దిల్లీలో పోలీసు కుటుంబాల నిరసన ప్రదర్శన



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని