Taj Mahal: అప్పట్లో షాజహాన్‌.. ఇప్పుడు ఆనంద్‌ ప్రకాశ్‌.. భార్యకు తాజ్‌మహల్‌ గిఫ్ట్‌!

సారీ డియర్‌! షాజహాన్‌లా నీకోసం నేను తాజ్‌ మహల్‌ కట్టించలేను కానీ అంత గొప్ప ప్రేమ నాలో ఉంది. ప్రేమికులు, భార్యా భర్తల మధ్య అప్పుడప్పుడు వినిపించే సరదా సంభాషణలు ఇవే కదూ. కానీ ఇక్కడ మీరు చదబోయే వ్యక్తి మాత్రం అలా కాదండోయ్‌! తన సతీమణి కోసం నిజంగానే తాజ్ మహల్‌ని కట్టించేశాడు.

Updated : 22 Nov 2021 20:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సారీ డియర్‌! షాజహాన్‌లా నీకోసం నేను తాజ్‌ మహల్‌ కట్టించలేను కానీ అంత గొప్ప ప్రేమ నాలో ఉంది. ప్రేమికులు, భార్యా భర్తల మధ్య అప్పుడప్పుడు వినిపించే సరదా సంభాషణలు ఇవే కదూ. కానీ ఇక్కడ మీరు చదవబోయే వ్యక్తి మాత్రం అలా కాదండోయ్‌! తన సతీమణి కోసం నిజంగానే తాజ్ మహల్‌ని కట్టించేశాడు. అబ్బురపరిచే ఈ కట్టడాన్ని చూడాలంటే మాత్రం మనం మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌కి వెళ్లాల్సిందే. ఆ ప్రాంత నివాసి ఆనంద్‌ ప్రకాశ్‌ తన భార్య మంజుషా పై ప్రేమతో ఇదంతా చేశాడు. ప్రపంచవింతల్లో ఒకటి, ప్రేమకు చిహ్నమైన తాజ్‌ మహల్‌నే ఎందుకు కట్టాలనిపించింది? దీని కోసం ఎన్నేళ్లు పట్టింది వంటి ఆసక్తికర విషయాలను ఇలా పంచుకున్నాడు ఆనంద్‌.

‘‘ కొత్తగా ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు తాజ్‌ మహాల్‌లా ఎందుకు కట్టకూడదు అని అనుకున్నా.  విభిన్నంగా ఉంటుంది కదా సరే అని అదే ఆలోచనతో ముందుకెళ్లా. ఇదే ఆమెకు మంచి గిఫ్ట్‌గా అనిపించింది. ఈ తాజ్‌మహాల్‌లో మొత్తం ఏడు గదులు ఉన్నాయి. పెద్ద హాల్‌, కిచిన్‌తో పాటు నాలుగు బెడ్ రూమ్స్‌, లైబ్రరీ, అలాగే ధ్యానం చేసుకునేందుకు మెడిటేషన్ హాల్‌  కూడా ఉంది. బయట నుంచి కనిపించే ఇంటీరియర్‌ డిజైన్‌ అంతా రియల్‌ తాజ్‌మహాల్ స్ఫూర్తిగా తీసుకున్నా. ఇది కట్టేందుకు మూడేళ్లు పట్టింది. తాజ్ మహల్‌లానే ఇది కూడా చీకట్లో ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఇంటి లోపల, బయటా లైటింగ్‌ను ఏర్పాటుచేశాం’’ అని వెల్లడించాడు. ఈ భవనాన్ని నిర్మించే ముందు ఇంజినీర్లు తాజ్‌ మహల్‌ ఎలా కట్టారనే విషయంపై ఓ అధ్యయనమే జరిపారట. కాగా.. ఇదే బుర్హాన్‌పుర్‌లోనే షాజహాన్‌ సతీమణి ముంతాజ్‌ మహాల్‌ కన్నుమూయడం గమనార్హం. అనంతరం ఆమె పార్థివదేహాన్ని ఆగ్రాకు తరలించి తాజ్‌మహాల్‌ నిర్మించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని