రైల్వే ‘సూపర్‌ మ్యాన్‌’కు అపూర్వ సత్కారం!

మహారాష్ట్రలో ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై పడిన బాలుడిని ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన రైల్వే సిబ్బంది మయూర్‌ షెల్కేకు అపూర్వ సత్కారం లభించింది. ముంబయిలోని సెంట్రల్‌ రైల్వే కార్యాలయంలో అధికారులు, సిబ్బంది చప్పట్లతో అతడి సాహసాన్ని అభినందించారు.

Updated : 20 Apr 2021 12:22 IST

ముంబయి: మహారాష్ట్రలో ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై పడిన బాలుడిని ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన రైల్వే సిబ్బంది మయూర్‌ షెల్కేకు అపూర్వ సత్కారం లభించింది. ముంబయిలోని సెంట్రల్‌ రైల్వే కార్యాలయంలో అధికారులు, సిబ్బంది చప్పట్లతో అతడి సాహసాన్ని అభినందించారు. చిన్నారి ప్రాణాల్ని కాపాడి.. ఆయన చేసిన సాహసం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. అనంతరం అధికారులు మయూర్‌ను ప్రశంసా పత్రంతో సత్కరించారు. 

మయూర్‌ షెల్కే మాట్లాడుతూ.. ‘ఇటీవల వాంగై రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ తన చిన్నబాబుతో కలిసి ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. ఈక్రమంలో బాబు అదుపుతప్పి ట్రాక్‌పై పడిపోయాడు. అదే సమయంలో ఎదురుగా రైలు వస్తుండటంతో.. సదరు మహిళ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది. అది గమనించి నేను వెంటనే ట్రాక్‌పైకి దూకి పరుగెత్తి బాలుడిని క్షేమంగా బయట పడేశాను. తొలుత నేను పరుగెత్తడం కూడా ప్రమాదమే అని భావించాను. కానీ, ఎలాగైనా ఆ బాలుడిని కాపాడగలనని నమ్మకం వచ్చాకే అలా చేశాను’ అని షెల్కే వివరించారు.  ‘తమ కుమారుడిని కాపాడిన అనంతరం ఆ మహిళ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. నాకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ కూడా నాకు ఫోన్‌ చేసి అభినందించారు’ అని షెల్కే తెలిపారు.

ముంబయి డివిజన్‌లోని వాంగై రైల్వే స్టేషన్‌లో ఏప్రిల్‌ 17వ తేదీన ఓ ఆరేళ్ల బాలుడు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోగా.. పాయింట్స్‌మన్‌ మయూర్‌ షెల్కే సాహసోపేతంగా రక్షించిన విషయం తెలిసిందే. మయూర్‌ కనబర్చిన అసమాన సాహసోపేత దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అయింది. మయూర్‌ గొప్పపని చేశారంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని