Kerala: నీటిపై తేలియాడే ఇల్లు!

ప్రతి మనిషికి ఇంటితో ఉండే అనుబంధం మాటల్లో చెప్పలేనది. అలాంటి ఇల్లు.. ప్రకృతి ప్రకోపానికి నాశమైతే భరించటం ఎంతో కష్టం.

Published : 12 Nov 2021 01:58 IST

కొట్టాయం: ప్రతి మనిషికి ఇంటితో ఉండే అనుబంధం మాటల్లో చెప్పలేనది. అలాంటి ఇల్లు.. ప్రకృతి ప్రకోపానికి నాశనమైతే భరించటం ఎంతో కష్టం. వరదల సమయాల్లో అనేక ఇళ్లు కుప్పకూలడం, నీటిలో కొట్టుకుపోవడం దేశంలో నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్యను అధికమించేందుకు కేరళలో.. ఓ అద్భుతమైన ఇల్లు ఆవిష్కృతమైంది. వరద సమయాల్లో నీటిలో 10 అడుగులు పైకి తేలేలా నిర్మించిన ఈ ఇల్లు.. గృహ నిర్మాణంలో సరికొత్త మార్పులకు నాంది పలికింది. 

కేరళలోని కొట్టాయంలో ఓ ప్రత్యేకమైన ఇల్లు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన కొట్టాయంలో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. నీటిలో రోజలకొద్దీ నానడంతో మరికొన్ని కుప్పకూలాయి. దీంతో గోపాలకృష్ణన్‌ ఆచారి.. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. నీటిలో తేలియాడేలా ఓ ఇంటిని నిర్మించారు. వరదలు పోటెత్తిన సమయంలో దానంతట అదే పైకి తేలుతూ.. ప్రవాహంలో దెబ్బతినకుండా ఉండేలా ఇంటిని నిర్మించారు. రెండేళ్లపాటు శ్రమించి.. నీటి ప్రవాహంలో 10 అడుగుల ఎత్తు వరకు తేలే సరికొత్త ఇంటికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రత్యేకమైన ఇంటి నిర్మాణంలో ఇసుక, కాంక్రీటును వినియోగించలేదు. చెక్క, జీఐ పైపులను మాత్రమే ఇంటి నిర్మాణంలో ఉపయోగించారు. ఓ ట్యాంకుకు. నాలుగు మూలల్లో అమర్చిన ఇనుప కడ్డీలపై ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. ఇంటి అడుగున గాలితో నిండిన ప్లాస్టిక్‌ డ్రమ్ములు ఉంటాయి. గోడల కోసం జీఐ పైపులు, కలపను మాత్రమే ఉపయోగించారు. ఇంటి పైకప్పు కోసం చిన్నపాటి ప్రత్యేక షీట్లను ఉపయోగించారు. సిమెంటు కాకుండా ప్రత్యేక గమ్‌తో నేలపై టైల్స్‌ వేశారు. ఈ ఇంట్లో ఓ పెద్ద హాల్‌, రెండు పడక గదులు, వంట గది, స్నానాల గది ఉన్నాయి. ఈ ఇంటిపై మరో అంతస్తు కూడా నిర్మించుకోవచ్చు. 

2018లో కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన అనంతరం.. ఇలాంటి ఇళ్లు నిర్మించాలని గోపాలకృష్ణన్‌ ఆచారి భావించారు. అప్పటికే ఈ విధానంలో ఇల్లు కట్టేందుకు ఆయన ప్రణాళికలు రూపొందిస్తుండగా.. వరదలను చూసి ప్రాజెక్టును అత్యవసరంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అలా.. చెంగనస్సేరి వాళపల్లిలో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా ఇంటిని నిర్మించారు. వరదలను తట్టుకునేలా గోపాలకృష్ణ నిర్మించిన ఇల్లు.. ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులు చేసే ప్రాజెక్టుల్లో ఈ ఇంటి నిర్మాణం ఓ అంశంగానూ మారింది. అయితే.. కేరళ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార గుర్తింపు, ప్రోత్సాహం అందలేదని గోపాలకృష్ణన్‌ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ తరహాలో ఇళ్లను నిర్మిస్తే విపత్తుల సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. చాలా తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తి చేయవచ్చని తెలిపారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని