Updated : 21/06/2021 17:02 IST

TS news: వరంగల్‌ అర్బన్‌ ఇక హన్మకొండ జిల్లా: కేసీఆర్‌

హన్మకొండ: వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ జిల్లాలకు హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్చనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. జిల్లాల కొత్తపేర్లపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు. వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. హన్మకొండలో రూ.57 కోట్లతో 3 అంతస్తుల్లో సమీకృత కలెక్టరేట్‌ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని హంగులు ఉన్న కలెక్టరేట్‌ నిర్మించినందుకు అభినందనలు తెలిపారు. వరంగల్‌ వైభవం చాటిచెప్పేలా కలెక్టరేట్‌ నిర్మించారని కితాబిచ్చారు. ‘‘ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకం. ప్రజలు తమ పనుల కోసం పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దు. మిగతా 30 కలెక్టరేట్‌లు కూడా త్వరగా పూర్తి కావాలి’’ అని కేసీఆర్‌ అన్నారు. కలెక్టర్‌ హోదా పేరు కూడా మారిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్‌ అనేవారని, ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరం లేదని అందువల్ల వారి పేరు మారిస్తే బాగుంటుందని అన్నారు. 

వరంగల్‌కు దంత వైద్యశాల

తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు మరో 4 నగరాలు అభివృద్ధి చెందాలని కేసీఆర్‌ అన్నారు. వరంగల్‌ నగరంలో దంతవైద్యశాల, దంతవైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని, రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుందని అన్నారు. ఇతర జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుందని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య విధానం కెనడాలో ఉందని తెలిసిందని, కెనడా వైద్య విధానంపై ఆధ్యయనానికి ఒక బృందాన్ని అక్కడికి పంపించి, కెనడాను మించిన వైద్య విధానం రాష్ట్రంలో అమలు చేస్తామని కేసీఆర్‌ అన్నారు. చైనాలో 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనం నిర్మించారని, చైనా తరహా నిర్మాణ పరిజ్ఞానం మనదగ్గర కూడా రావాలని  కేసీఆర్‌ చెప్పారు. ఏడాదిన్నరలోపు వరంగల్‌ ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.

జులై 1 నుంచి పల్లె ప్రగతి

జులై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కలిపి నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థలకు జులై నిధులు ముందే విడుదల చేస్తామని చెప్పారు. మరోవైపు ఎంజీఎం ఆస్పత్రిని కూడా పడగొట్టి కొత్త ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఎంజీఎం ఆస్పత్రి భవనాలు పాతపడినాయని, కొత్త భవనాలను నిర్మించి ఎంజీఎంని అత్యాధునికంగా మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తామని చెప్పారు. ఎంజీఎం కొత్త ఆస్పత్రి నిర్మాణానికి రూ. 2, 3 వేల కోట్లు ఖర్చయినా ఫర్వాలేదన్నారు.

ధైర్యంతోనే కరోనాను జయించవచ్చు

ధైర్యంతోనే కరోనాను సగం జయించవచ్చని సీఎం కేసీఆర్‌ అన్నారు. తనకు కూడా కరోనా సోకిందని, కేవలం రెండు మందు బిళ్లలతోనే తగ్గిపోయిందని చెప్పారు. ఊహాగానాలతో ప్రజలను భయపెట్టవద్దని, కరోనాపై భయపెట్టేలా వార్తలు ఇవ్వొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది భయాందోళనలతో మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు కొని పెట్టుకుంటున్నారని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సామర్థ్యానికి మించి వస్తున్నారని, వచ్చిన రోగులను తిరిగి పంపించకుండా ఎక్కడో ఓక చోట పడుకోబెట్టి చికిత్స అందిస్తారని అన్నారు. ‘‘ ప్రభుత్వ ఆస్పత్రులకు సెల్యూట్‌ చేస్తున్నా. ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులపై దాడులు సరికాదు. కరోనా ఉద్ధృతి ఉన్నా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేశారు. కిట్లు అందించారు’’ అని కేసీఆర్‌ అభినందించారు. లాక్‌డౌన్‌ మరిన్ని ఎక్కువ రోజులు పెడితే ప్రజలకు ఉపాధి పోతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే లాక్‌డౌన్‌ సంపూర్ణంగా ఎత్తేశామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సడలింపులు ఇచ్చినా కేసుల వ్యాప్తి పెరగలేదన్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని