Tripura Police: ఐ-ప్యాక్‌ సభ్యులది నిర్బంధం కాదు.. క్వారంటైన్‌..!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన భారత రాజకీయ కార్యాచరణ కమిటీ(ఐ-ప్యాక్‌) సభ్యుల్ని గృహ నిర్బంధంలో ఉంచినట్లు వస్తున్న వార్తల్ని త్రిపుర పోలీసులు తోసిపుచ్చారు.

Published : 27 Jul 2021 18:26 IST

అగర్తల: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన భారత రాజకీయ కార్యాచరణ కమిటీ(ఐ-ప్యాక్‌) సభ్యుల్ని గృహ నిర్బంధంలో ఉంచినట్లు వస్తున్న వార్తల్ని త్రిపుర పోలీసులు తోసిపుచ్చారు. వారిని నిర్బంధించలేదని.. క్వారంటైన్‌లోనే  ఉంచామని పోలీసులు మంగళవారం స్పష్టం చేశారు. 22 మంది ఐ-ప్యాక్‌ సభ్యులకు సంబంధించి కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు వారు వెల్లడించారు. ఐ-ప్యాక్‌ సభ్యులను ఆదివారం రాత్రి నుంచి వారు బస చేసిన హోటల్ వుడ్‌ల్యాండ్ పార్క్‌లో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్లు సమాచారం. అయితే గృహ నిర్బంధానికి సంబంధించి ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాచారమూ లేదని పశ్చిమ త్రిపుర ఎస్పీ మాణిక్‌ దాస్‌ తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 20-22 మంది వ్యక్తులు వుడ్‌ల్యాండ్ పార్క్‌ హోటల్‌లో ఉంటున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు.  వారి వివరాలపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు.

వారం రోజులుగా ఐ-ప్యాక్‌ సభ్యులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంచరించడం సహా చాలా మంది వ్యక్తులను కలిసినట్లు తెలిసిందని మాణిక్‌ దాస్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసినట్లు తెలిపారు. తమ నిబంధనల్లో భాగాంగా కొవిడ్‌ పరీక్ష ఫలితాలు వచ్చేవరకు వారిని ఇక్కడే ఉంచినట్లు వివరించారు. అయితే ఆ ఫలితాలు బుధవారం లేదా గురువారం అందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఓ పరిశోధన కోసం వారు త్రిపురకు వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఆ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కొవిడ్‌ పరీక్ష ఫలితాలు వచ్చేవరకు వారిని విడుదల చేసేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఆ తర్వాత వారిని విడుదల చేయడం.. దర్యాప్తు నివేదికపై ఆధారపడి ఉందన్నారు. త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న రాజకీయ అవకాశాలను అధ్యయనం చేసేందుకు వారం రోజులుగా ఐ-ప్యాక్‌ సభ్యుల బృందం అగర్తలలోని ఓ హోటల్లో బస చేసింది. 


 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని