ABCDEF GHIJK ZuZu.. ఇదేంటో తెలియాలంటే చదవాల్సిందే!

పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో తల్లిదండ్రులు చేసే కసరత్తులు అన్నీ ఇన్నీ కావు. జన్మ నక్షత్రాలు.. రాశులు.. ఇలా అనేక అంశాలకు తగినట్టుగా కొత్తగా పేరు పెట్టేందుకు......

Updated : 28 Oct 2021 04:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో తల్లిదండ్రులు చేసే కసరత్తులు అన్నీ ఇన్నీ కావు. జన్మ నక్షత్రాలు.. రాశులు.. ఇలా అనేక అంశాలకు పరిగణనలోకి తీసుకుని కొత్తగా ఏదైనా పేరు పెట్టేందుకు ఎంతగానో పరితపిస్తుంటారు. ఇలా పెడుతున్న మోడ్రన్‌ పేర్లలో నోటికి తిరగనివి ఎన్నో! అది వేరే సంగతిలెండి. కానీ ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకుకు వింత పేరు పెట్టాడు. ఆంగ్ల అక్షరాల పట్ల తనకున్న అభిమానంతో తన కొడుకుకు ఏకంగా ఇంగ్లిష్‌ ఆల్ఫాబెట్స్‌లో ఉన్న తొలి 11 అక్షరాలను వరుసగా పెట్టేశాడు. ఆశ్చర్యంగా ఉన్నా.. మీరు చదువుతున్నది నిజమే. ఆ బాలుడి పేరు ABCDEF GHIJK Zuzu. ఈ పేరు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇలా వెలుగులోకి..

ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రా ప్రావిన్స్‌లోని మౌరా ఎనిమ్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో ఇటీవల వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టారు. అక్కడ చదువుతున్న 12 ఏళ్ల బాలుడి పేరు చూసి వైద్యశాఖ అధికారులు షాకైనట్టు స్థానిక మీడియా పేర్కొంది. జూనియర్‌ హైస్కూల్‌లో చదువుతున్న ఆ బాలుడి వ్యాక్సినేషన్‌ స్లిప్‌, యూనిఫాంపై ఉన్న ట్యాగ్‌పైనా అదే పేరు ఉండటంతో అదే అతడి అసలు పేరని తెలిసి స్టన్‌ అయ్యారట. ఆ విద్యార్థి తండ్రికి క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ అంటే ఎంతో ఇష్టం. దీంతో తన కొడుకు పుట్టడానికి ఆరేళ్ల ముందే ఇలాంటి పేరు పెట్టాలని సిద్ధమైనట్టు బాలుడి తండ్రి జుల్ఫామీ చెప్పుకొచ్చారు. అయితే, తన కొడుకును Adef అని తరచూ పిలుచుకుంటామని వివరించారు. తాను రచయిత కావాలనుకున్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందని, ఇప్పటికీ రాయడమంటే తనకెంతో ఇష్టమని జుల్ఫామీ తెలిపారు.

తన మరో ఇద్దరు పిల్లలకు కూడా ఇలాంటి పేర్లే పెట్టాలని భావించానని, అయితే కుటుంబ సభ్యుల సూచన మేరకు ఆ ఆలోచన విరమించకున్నానని జుల్ఫామీ చెప్పారు. ఒకవేళ వారు అంగీకరించి ఉంటే.. NOPQ RSTUV అని ఒకరికి, XYZ అని ఇంకొకరికి పెట్టాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇండోనేషియాలో ఈ ఏడాది వైరల్‌ అయిన యునిక్‌ పేర్లలో ఇదొక్కటే కాదు.. ఏప్రిల్‌లో ఓ వ్యక్తి అయితే ఏకంగా తాను పనిచేస్తున్న కార్యాలయంలో డిపార్టుమెంట్‌ పేరునే తన బిడ్డకు పెట్టడం అప్పట్లో వైరల్‌ అయింది. 2019లో మరో వ్యక్తి కూడా తనకు పుట్టిన శిశువుకు గూగుల్‌ అని పేరు పెట్టడం కూడా వైరల్‌ అయింది. ఆ శిశువు బర్త్‌ సర్టిఫికెట్‌ వైరల్‌ కావడంతో టెక్‌ దిగ్గజం గూగుల్‌ కానుకలు కూడా పంపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని