Monsoon: నైరుతి రుతుపవనాల తిరోగమనం ఆలస్యం.. కారణం ఇదే!

దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ అక్టోబరు 6 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. అత్యంత ఆలస్యమైన తిరోగమనాల్లో ఇది ఒకటని పేర్కొంది. దేశ వ్యవసాయంపై కీలక ప్రభావం చూపే నైరుతి రుతుపవనాలు...

Published : 01 Oct 2021 01:49 IST

దిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ అక్టోబరు 6 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. అత్యంత ఆలస్యమైన తిరోగమనాల్లో ఇది ఒకటని పేర్కొంది. దేశ వ్యవసాయంపై కీలక ప్రభావం చూపే నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. క్రమంగా విస్తరించి, వాయువ్య రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో తిరుగుముఖం పడతాయి. ఈ క్రమంలో ఇవి గంగా మైదానం ద్వారా బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. తదనంతరం ఇవి ఈశాన్యం నుంచి తిరోగమనం చెందడం వల్ల వీటిని 'ఈశాన్య రుతుపవనాలు'గా పరిగణిస్తారు. ఇవి బంగాళాఖాతంలో చక్రవాతాలను ఏర్పరచడం ద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాలకు ఎక్కువ వర్షపాతాన్ని కలగజేస్తాయి.

సెప్టెంబరులో భారీ వర్షాలు..

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్‌ 3న దేశంలోకి ప్రవేశించాయి. వాస్తవానికి జూన్‌ 1నే రావాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రోజులు ఆలస్యంగా కేరళను తాకాయి. కానీ తిరోగమనంపై తుపానులు ప్రభావం చూపినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ ప్రక్రియ ఆలస్యమైందని వివరించింది. మరోవైపు ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి దేశంలో సాధారణం కంటే 9 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగ, సెప్టెంబరులో కురిసిన వర్షాలు ఈ లోటును ఒక శాతానికి తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. మన దేశంలో దాదాపు సగం వ్యవసాయ భూములు వర్షాధారమైనవే. ప్రధానంగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి పంటలు పండిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని