త్రివర్ణ శోభితంగా ముస్తాబైన ఎర్రకోట 

74వ స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంత నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథుల నడుమ ఈ సంబురాలు జరగనున్నాయి.  కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు. 

Published : 14 Aug 2020 21:35 IST

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
శనివారం ఉదయం 7.30 గంటలకు జెండా ఆవిష్కరించనున్న ప్రధాని


దిల్లీ: 74వ స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంత నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథుల నడుమ ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ సారి 22 మంది అధికారులతోనే గౌరవ వందనం స్వీకరించబోతున్నారు. దిల్లీ పోలీసులు ఈసారి కేవలం 350 మందే పాల్గొనబోతున్నారు. గతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించి ఉండేవి. కానీ ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తిస్థాయిలో 350 మంది పోలీసులను కూడా 14రోజుల క్వారంటైన్‌ తరువాత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కరోనాను జయించిన పోలీసులు, ప్రభుత్వ అధికారులను ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారు. అందరూ కూర్చునేందుకు భౌతిక దూరంతో కుర్చీలు ఏర్పాటు చేశారు.  ప్రతి ఏడాది వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యేవారు. కానీ ఈసారి విద్యార్థులు హాజరు కావద్దంటూ అధికారులు ఆదేశించారు.

ఎర్రకోట ప్రాంగణం ఇప్పటికే త్రివర్ణ శోభితాన్ని సంతరించుకుంది. ప్రధాని మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేసిన తరువాత ప్రసంగించేందుకు బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌క్లోజర్‌, అతిథులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకల అతిథుల జాబితాను 150కి కుదించినట్లు తెలుస్తోంది.

ఈసారి 5వేల మందే! 
ఎర్రకోటలో ఏర్పాట్లన్నీ పూర్తి కాగా గురువారం తెల్లవారుజామున చిరుజల్లుల మధ్యలోనే త్రివిధ దళాలు రిహార్సల్స్‌ నిర్వహించాయి. ఏటా 30వేల మందికి పైగా హాజరయ్యే ఎర్రకోటలో ఈసారి 5వేల మందితోనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుర్చీల మధ్య రెండు గజాల దూరం ఉండనుంది. మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉదయం 7.21 గంటలకు ఎర్రకోట చేరుకొని 7.30 గంటలకు జెండా ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా ఉద్ధృతి, సవాళ్లు, ఆత్మనిర్బర్‌ భారత్‌ సహా మరిన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు