థియేటర్‌కి.. పాప్‌కార్న్‌కు సంబంధమేంటి?

థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నామంటే.. చేతిలో పాప్‌కార్న్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. వాటిని తింటూ సినిమా చూస్తే ఉండే కిక్కే వేరు. అందుకే థియేటర్లో చిరుతిండ్లు ఎన్ని ఉన్నా పాప్‌కార్న్‌ కొనుగోలు చేయని ప్రేక్షకుడు ఉండడు. అంతలా పాపులరిటీ సంపాదించిన పాప్‌కార్న్‌ అసలు సినిమా థియేటర్లలో

Published : 05 Apr 2021 01:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నామంటే.. చేతిలో పాప్‌కార్న్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. వాటిని తింటూ సినిమా చూస్తే ఉండే కిక్కే వేరు. అందుకే థియేటర్లో చిరుతిండ్లు ఎన్ని ఉన్నా పాప్‌కార్న్‌ కొనుగోలు చేయని ప్రేక్షకుడు ఉండడు. అంతలా పాపులరిటీ సంపాదించిన పాప్‌కార్న్‌ అసలు సినిమా థియేటర్లలో ముఖ్యమైన చిరుతిండిగా ఎలా మారింది? సినిమా చూస్తూ పాప్‌కార్న్‌ తినడం ఎప్పుడు మొదలుపెట్టారు?తెలుసుకుందాం పదండి..

18వ శతాబ్దంలోనే ఈ పాప్‌కార్న్‌ ఆహార ప్రియుల్ని ఆకట్టుకునేది. అంగళ్లు, తిరునాళ్లు జరిగే ప్రాంతాల్లో ఈ పాప్‌కార్న్‌ను విక్రయించేవారు. దీని ధర చాలా తక్కువగా ఉండేది. అందుకే పేదలు, సామాన్య ప్రజలు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసేవారు. జనసమూహం ఎక్కడ ఉంటే అక్కడ ఈ పాప్‌కార్న్‌ విక్రయించేవాళ్లు ప్రత్యక్షమయ్యేవారు. కాలక్రమంలో సినిమా థియేటర్లు వచ్చాయి. ప్రేక్షకులు అక్కడికి వెళ్లి సినిమాలు చూస్తారని తెలిసి పాప్‌కార్న్‌ను అమ్మేందుకు ప్రయత్నించగా.. థియేటర్ల యజమానులు నిరాకరించారు. తొలినాళ్లలో విడుదలైన మూకీ సినిమాల్లో సన్నివేశాలకు మధ్య దానికి సంబంధించిన వాక్యాలు ప్రదర్శించేవారు. అవి చదువు వచ్చినవాళ్లే అర్థం చేసుకోగలరు. పైగా టికెట్‌ ధర కాస్త ఎక్కువ. అందుకే బాగా చదువుకున్న వారు, సంపన్నులకు మాత్రమే థియేటర్లలో అనుమతి ఉండేది. వారు ఇలాంటి పేదోళ్ల చిరుతిండి తినరని థియేటర్ల యాజమానుల భావన. మరో కారణమేంటంటే.. మూకీ సినిమాల్లో మాటలు ఉండవు. థియేటర్‌ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అలాంటి సమయంలో పాప్‌కార్న్‌ తింటుంటే వచ్చే శబ్దాలతో పక్కన ఉండే ప్రేక్షకులకు ఇబ్బంది కలగొచ్చు. ఈ కారణాలతో పాప్‌కార్న్‌ను మొదట థియేటర్లలోకి రానివ్వలేదు.

టాకీ.. గ్రేట్‌ డిప్రెషన్‌తో థియేటర్లోకి అడుగుపెట్టి..

1927 తర్వాత టాకీ సినిమాలు వచ్చాయి. దీంతో పేద, గొప్ప.. అక్షరాస్యులు, నిరాక్షరాస్యులు అని తేడా లేకుండా అందరూ సినిమాలు చూసేందుకు వీలు కలిగింది. దీంతో థియేటర్లకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వచ్చేవాళ్లు. రెండేళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అమెరికా ప్రజల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. దీంతో మానసికంగా కాస్త కుదుట పడాలని సినిమాలు చూసేందుకు థియేటర్లకు వచ్చేవారు. ఖాళీగా కూర్చొని సినిమా చూడటం కంటే ఏదైనా తింటూ చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడతారు. దీంతో ప్రేక్షకులంతా బయట పాప్‌కార్న్‌ కొనుగోలు చేసి థియేటర్లకు వస్తుంటే యాజమన్యాలు నిరాకరించలేకపోయాయి. కొన్నాళ్లకు పాప్‌కార్న్‌ విక్రయించేవాళ్లు.. థియేటర్‌ యజమానులకు కొంత రుసుము చెల్లించి థియేటర్ లాబీల్లో పాప్‌కార్న్‌ అమ్మడం మొదలుపెట్టారు.

లాభాలు బాగా వస్తుండటంతో సొంత పాప్‌కార్న్‌ మొదలు

ఐదు నుంచి పది సెంట్లు ఇస్తే సంచి నిండా పాప్‌కార్న్ వచ్చేవి. దీంతో ప్రేక్షకులందరూ వీటిని కొనేవారు. సినిమా టికెట్ల కంటే ఎక్కువ లాభం పాప్‌కార్న్‌లో వస్తుందన్న విషయం తెలుసుకున్న యజమానులు పాప్‌కార్న్‌ విక్రయదారులకు థియేటర్లోకి అనుమతించకుండా.. స్వయంగా పాప్‌కార్న్‌ విక్రయించడం ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధం సమయంలో అమెరికాలో పంచదార నిల్వలు బాగా పడిపోయాయి. దీంతో క్యాండీస్‌, సోడాల తయారీ తగ్గుముఖం పట్టింది. పాప్‌కార్న్‌కు పంచదార అవసరం లేదు. దీంతో క్యాండీలు, సోడాలు కొనుగోలు చేసేవాళ్లూ కూడా పాప్‌కార్న్‌ వైపు మొగ్గు చూపారు. అలా థియేటర్లో పాప్‌కార్న్‌ ముఖ్యమైన, తప్పనిసరి చిరుతిండిగా మారిపోయింది. అలా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ పాప్‌కార్న్‌ విస్తరించింది.

ఇవీ చదవండి..

ఎడిసన్‌ వల్ల సినీ పరిశ్రమ పారిపోయింది

సినిమా ట్రైలర్‌ ఎలా మొదలైందంటే..?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని