Health Insurance: 30% ప్రజలకు ఆరోగ్యబీమా దూరం

దేశంలో దాదాపు 40 కోట్ల ప్రజలకు (జనాభాలో 30%) ఎలాంటి వైద్యఆరోగ్య బీమా లేదని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

Updated : 17 Sep 2022 14:39 IST

 40 కోట్ల మందికి దక్కని ధీమా : నీతి ఆయోగ్‌

దిల్లీ: దేశంలో దాదాపు 40 కోట్ల ప్రజలకు (జనాభాలో 30%) ఎలాంటి వైద్యఆరోగ్య బీమా లేదని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ‘హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఫర్‌ ఇండియాస్‌ మిస్సింగ్‌ మిడిల్‌’ పేరుతో శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. దేశ జనాభాలో 50% మందికి ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా బీమా అందుతుండగా.. మరో 20% విభిన్న సామాజిక, ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా పొందుతున్నారు. మిగతా 30% మందికి మాత్రం ఎలాంటి ఆరోగ్యరక్షణా లేదని ఈ నివేదిక పేర్కొంది. ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజనలో ఉన్న వివిధ రకాల ఆంక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇలా బీమా వర్తించనివారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలిపింది. ఇందులో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాలవారూ ఉన్నారని వెల్లడించింది. అత్యధికంగా స్వయం ఉపాధిపై ఆధారపడినవారే ఇలా ఆరోగ్యబీమాకు దూరంగా ఉంటున్నట్లు అంచనా వేసింది. దేశంలోని వైద్యఆరోగ్య బీమా పథకాలు ఇలాంటివారికి అనువుగా లేవని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. అధిక ఆదాయవర్గాల కోసం రూపొందించిన ప్రైవేటు బీమాలు లబ్ధిదారుల కొనుగోలుశక్తి కంటే రెండు మూడు రెట్లు అధిక ధరల్లో ఉంటున్నాయని తెలిపింది. ప్రాథమిక వైద్యసేవలు అందించడం కోసం ఐఆర్‌డీఏఐ 2020లో ఆరోగ్య సంజీవని హాస్పిటలైజేషన్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, దీని ప్రీమియం అధికంగా ఉండటం, చాలా రోగాలకు వైద్యసేవలు పొందాలంటే రెండు నుంచి నాలుగేళ్లు వేచిచూడాల్సి రావడం వల్ల ఈ బీమాకు ఆదరణ రాలేదని విశ్లేషించింది. ఈ పథకాన్ని విజయవంతం చేయాలంటే సత్వర వైద్యం, అవుట్‌ పేషెంట్‌ ప్రయోజనాలను కూడా కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. ప్రస్తుతం బీమా పరిధిలోకి రాని కుటుంబాలు ఏటా రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ఆరోగ్యబీమా కోసం.. అవుట్‌పేషెంట్‌ బీమా కవరేజీకి రూ.5 వేల వరకు కట్టగలుగుతాయని పేర్కొంది. బీమా పథకాలను ఈ శ్రేణిలో తీసుకురావాలని సూచించింది. బీమా కంపెనీలు సరైన వినియోగదారులను గుర్తించి వారి వద్దకు చేరుకోకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితులకు కారణమని తెలిపింది. ప్రభుత్వం వైద్యఆరోగ్య బీమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వినియోగదారుల్లో విశ్వాసం పెంచడానికి కట్టుదిట్టమైన రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటుచేయాలని సిఫార్సు చేసింది. అన్ని ఆరోగ్యబీమా సంస్థలకూ పీఎంజేఏవై ఐటీ ప్లాట్‌ఫాం, నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోడానికి వీలు కల్పిస్తే నిర్వహణ ఖర్చులు తగ్గి ప్రీమియం తగ్గించడానికి వీలవుతుందని సూచించింది. ప్రస్తుతం ఆరోగ్యబీమా పరిధిలోకి రాని పేదలకు పీఎంజేఏవైని విస్తరించడంతోపాటు మిగతావారికి బీమా కల్పించడానికి ప్రభుత్వమే పాక్షికంగా కొంత సొమ్ము చెల్లిస్తే బాగుంటుందని నీతి ఆయోగ్‌ సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని