Updated : 06/10/2021 13:23 IST

Cancer: కోరలు చాస్తున్న కేన్సర్‌

నిమ్స్, ఐసీఎంఆర్, ఎన్‌సీడీఐఆర్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

2025 నాటికి తెలంగాణలో 11% పెరుగుదల!

హైదరాబాద్‌: రాష్ట్రంలో కేన్సర్‌ కోరలు చాస్తోంది. 2025 నాటికి వివిధ రకాల కేన్సర్లలో పెరుగుదల 11.1 శాతం వరకు ఉంటుందని తాజా అధ్యయనంలో నిపుణులు అంచనా వేశారు. సగం పొగాకు వల్లే సంభవిస్తాయని, రానున్న ముప్పును ఇది సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత వైద్య విధాన పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ వ్యాధి, సమాచార పరిశోధన సంస్థ(ఎన్‌సీడీఐఆర్‌), నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) మంగళవారం విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నిమ్స్, ఎంఎన్‌జే, బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రులకు వచ్చే కేసుల వివరాలను ఇందులో విశ్లేషించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బాధితుల సమాచారాన్ని క్రోడీకరించి ముప్పును అంచనా వేసినట్లు నిపుణులు తెలిపారు.

పొగాకు మానేస్తేనే..

కేన్సర్లకు ప్రధాన కారణం పొగాకే అని తేలింది. పురుషుల్లో 42.2శాతం, మహిళల్లో 13.5శాతం పొగాకు ఏదో ఒక రూపంలో తీసుకోవడమేనని గుర్తించారు. పురుషుల్లో 26శాతం ఊపిరితిత్తుల కేన్సర్లు, 19శాతం నాలుక, 31శాతం మంది నోరు, 7శాతం మంది అన్నవాహిక కేన్సర్ల బారిన పడుతున్నారు. సిగరెట్టు, చుట్టలు, తంబాకు తదితర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడంతో ఆయా కేన్సర్ల బారిన పడుతున్నారని వైద్యులు గుర్తించారు. మహిళల్లో పొగాకు తీసుకోవడం వల్ల 30శాతం ఊపిరితిత్తులు, 17శాతం నాలుక, 22శాతం నోరు, 16శాతం అన్నవాహిక కేన్సర్ల బారిన పడుతున్నారు. పొగాకు మానేయడం ద్వారా సగం కేన్సర్లను అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 60-80 శాతం మంది వ్యాధి రెండు, మూడో దశ తర్వాత వైద్యులను  సంప్రదిస్తున్నారు.

2025 నాటికి పెరుగుదల ఇలా...

2020: 22,186 (పురుషులు), 25,343 (మహిళలు)
2025: 24,857 (పురుషులు), 28,708 (మహిళలు)

అప్రమత్తత అవసరం

నిమ్స్‌లో 2014లోనే కేన్సర్‌ రిజిస్ట్రీని ప్రవేశపెట్టాం. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల నుంచి సమాచారం సేకరించి ఐసీఎంఆర్, ఎన్‌సీడీఐఆర్‌ ఆధ్వర్యంలో విశ్లేషిస్తున్నాం. తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం రానున్న నాలుగేళ్లలో 11.1 శాతం కేసులు పెరగడమంటే సాధారణ విషయం కాదు. మహిళల్లో రొమ్ము కేన్సర్ల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, అధిక బరువు రొమ్ము కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆరోగ్యకర జీవనశైలితోపాటు వ్యాయామం, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలతో మిళితమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం.

- డా.సదాశివుడు, విభాగాధిపతి, మెడికల్‌  ఆంకాలజీ, నిమ్స్‌

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని