Marriage Registration: పెళ్లంటే లెక్కలేదు!.. నమోదును పట్టించుకోని బల్దియా

ఏటా వేలాది జననాలు.. మరణాలు. వీటన్నింటికీ లెక్కలున్నాయిగానీ.. జనన, మరణాల మధ్యలోని మనువుకు నగరంలో లెక్క లేకుండా పోయింది.

Published : 09 Sep 2021 10:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏటా వేలాది జననాలు.. మరణాలు. వీటన్నింటికీ లెక్కలున్నాయిగానీ.. జనన, మరణాల మధ్యలోని మనువుకు నగరంలో లెక్క లేకుండా పోయింది. పౌరులు సొంతంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి నమోదు చేసుకుంటున్న వివాహాలే నమోదవుతున్నాయి. వేర్వేరు మతాల ప్రార్థనాలయాలు, కాలనీలు, బస్తీలు, ఇళ్లలో జరిగే పెళ్లిళ్లను ఎవరూ పట్టించుకోవట్లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం తప్పనిసరి వివాహాల నమోదు చట్టాన్ని తెచ్చింది. వివాహాల నమోదు అధికారులను నియమిస్తూ డిసెంబరు 23, 2014న ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం సబ్‌రిజిస్ట్రార్లతోపాటు పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో సంబంధిత కమిషనర్లకు పెళ్లిని నమోదు చేసే అధికారం ఉంది. సబ్‌ రిజిస్ట్రార్లు దరఖాస్తు చేసుకున్న దంపతుల వివాహాలను రిజిస్టర్‌ చేయాల్సి ఉండగా, స్థానిక సంస్థల అధికారులు మాత్రం వారి పరిధిలో జరిగే అన్ని వివాహాలను నమోదు చేయాలి. సమాంతరంగా సబ్‌ రిజిస్ట్రార్ల నుంచి వివరాలను తెప్పించుకుని సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించాలి. జీహెచ్‌ఎంసీ ఏర్పడ్డాక.. నగరంలో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అంతకుముందు వరకు.. నగర శివారుల్లోని మున్సిపాలిటీల కమిషనర్లు వివాహాలను నమోదు చేసేవారు. అంటే.. 2007 నుంచి హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ చట్టాన్ని పట్టించుకోవట్లేదు. అప్పట్నుంచి లోకాయుక్త, జిల్లా కలెక్టర్లు.. జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు లేఖలు రాస్తూనే ఉన్నారు. తాజాగా లోకాయుక్త నుంచి వివాహాల నమోదు చట్టాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు, బల్దియాకు నోటీసులు వచ్చాయి. ఆమేరకు కలెక్టర్లతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లకు చెందిన సహాయ వైద్యాధికారులు సమావేశమయ్యారు. వివాహాల నమోదు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ రెండు సర్కిళ్లలో నామమాత్రంగా ప్రక్రియ మొదలై, అంతటితో ఆగిపోయింది.

పట్టించుకోని కమిషనర్‌..

లోకాయుక్తతో పాటు, గ్రేటర్‌ పరిధిలోని జిల్లా కలెక్టర్లు అనేకసార్లు జీహెచ్‌ఎంసీని వివాహాల నమోదు చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్‌ కార్యాలయం మాత్రం ఆ అంశానికి ప్రాధాన్యం ఇవ్వట్లేదు.

చాలా ప్రయోజనాలు..

ఇంటి పేరు మార్పు, ప్రభుత్వ పథకాలు, ఆధార్‌కార్డు సవరణ, ఆరోగ్యకార్డులు, బీమా, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ ఆస్తుల పంపకం, రెండో వివాహాన్ని అడ్డుకోవడం, వరకట్నం, వేధింపులు, వీసా, పాస్‌పోర్టు, విదేశీయానం, కారుణ్య నియామకాలు, ఇతరత్రా అవసరాలకు వివాహ ధ్రువీకరణపత్రం అవసరం. బాల్య వివాహాల నిర్మూలన, ప్రభుత్వ పథకాల రూపకల్పన, అర్హుల ఎంపిక, కులాంతర, మతాంతర వివాహాల గణన, ఇతరత్రా కార్యక్రమాలకు ప్రభుత్వం వివాహాల నమోదును చేపడుతోంది. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 సంవత్సరాల వయసు నిండితే పుట్టిన తేదీ, చిరునామా, ఇతర ధ్రువీకరణల ఆధారంగా ప్రభుత్వం వివాహాలను నమోదు చేస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని