Schools: బడుల మూతతో చదువులు దూరం

కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని పాఠశాలలు దీర్ఘకాలంగా మూతపడటం... విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావమే చూపించింది! గ్రామీణ ప్రాంతాల్లో 37% మంది, పట్టణ ప్రాంతాల్లో 19% మంది విద్యార్థులు పూర్తిగా..

Updated : 08 Sep 2021 15:02 IST

సగానికి పైగా పిల్లలు కొన్ని పదాలనే గుర్తిస్తున్నారు
తాజా సర్వేలో వెల్లడి

దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని పాఠశాలలు దీర్ఘకాలంగా మూతపడటం... విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావమే చూపించింది! గ్రామీణ ప్రాంతాల్లో 37% మంది, పట్టణ ప్రాంతాల్లో 19% మంది విద్యార్థులు పూర్తిగా చదువులకు దూరమైనట్టు వెల్లడైంది. ‘ద స్కూల్‌ చిల్డ్రన్స్‌ ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌ లెర్నింగ్‌’ సంస్థ... ‘‘లాక్డ్‌ అవుట్‌: ఎమర్జెన్సీ రిపోర్ట్‌ ఆన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌’’ పేరున ఆగస్టులో సర్వే నిర్వహించింది. దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వెనుకబడిన కుటుంబాలకు చెందిన 1,400 మంది విద్యార్థులను వలంటీర్లు కలుసుకుని, వారి పఠన, రచన నైపుణ్యాల స్థాయిని తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌ చదువులు ఎంతవరకూ వారికి ఉపకరిస్తున్నాయన్న వివరాలనూ సేకరించారు. ఈ నివేదికను తాజాగా విడుదల చేశారు.

నివేదిక ఏం చెప్పిందంటే..
గ్రామాల్లో కేవలం 28% మంది విద్యార్థులే నిత్యం చదువుతున్నారు. 37% మంది చదవడం పూర్తిగా మానేశారు. సగానికి పైగా మంది కేవలం కొన్ని పదాలను మాత్రమే గుర్తించగలుగుతున్నారు. 
✽ పట్టణ ప్రాంతాల్లో 47% మంది నిత్యం చదువులను కొనసాగిస్తున్నారు. 19% మంది అస్సలు చదవడం లేదు. 42% మంది కొన్ని పదాలనే గుర్తిస్తున్నారు.
పట్టణ ప్రాంతాలకు చెందిన బాలబాలికల్లో 24% మంది, గ్రామీణుల్లో 8% మందే క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నారు.
దళిత, గిరిజన విద్యార్థులకు రెగ్యులర్, ఆన్‌లైన్‌ విద్య రెండూ దూరమయ్యాయి. వారిలో పఠన నైపుణ్యాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీల్లో కేవలం 4% మందే నిత్యం ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నారు.
98% మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులు బడులను వెంటనే తెరవాలని కోరుతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ కొనే స్థోమత లేక..
ఎలక్ట్రానిక్‌ పరికరాలను కొనుక్కునేంత స్థోమత, ఇంటర్నెట్‌ సదుపాయం లేకపోవడం వల్ల... చాలామంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ చదువులు దరిచేరలేదు. గ్రామాల్లోని సగం కుటుంబాల వారికి అసలు స్మార్ట్‌ఫోనే లేదు. ఒకవేళ పెద్దవాళ్ల దగ్గర ఉన్నా, పిల్లలు చదువుకోవడానికి అందుబాటులో ఉండటం లేదు. ఇంట్లో ఒక విద్యార్థికి స్మార్ట్‌ఫోన్‌ ఉన్నా, మరో విద్యార్థి లైవ్‌లో పాఠాలు వినడం కుదరడం లేదు.

65% తల్లిదండ్రులది అదే మాట..
బడుల మూసివేత కారణంగా తమ పిల్లల పఠన, రాత నైపుణ్యాలు బాగా తగ్గిపోయాయని 65% మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. కేవలం 4% మంది తల్లిదండ్రులు మాత్రమే లాక్‌డౌన్‌ సమయంలో తమ పిల్లల రీడింగ్, రైటింగ్‌ సామర్థ్యాలు పెరిగినట్టు చెప్పారు. బడులు తెరిచినా... విద్యార్థుల పఠన, రచనా సామర్థ్యాలను మెరుగుపరచడానికి చాలాకాలం పడుతుందని విద్యా రంగ నిపుణులు భావిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని