కరోనా కొమ్ముల నుంచి రక్షిస్తున్న 2 యాంటీబాడీలు!

దక్షిణ అమెరికా ఒంటెజాతికి చెందిన లామాస్‌లోని రెండు రకాల యాంటీబాడీలు నావెల్‌ కరోనా వైరస్‌ను సమర్థంగా తటస్థీకరిస్తున్నాయని సమాచారం. కొవిడ్‌-19 బాధితులకు మెరుగైన చికిత్సా పద్ధతులు రూపొందించేందుకు తమ....

Published : 13 Jul 2020 23:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ అమెరికా ఒంటెజాతికి చెందిన లామాస్‌లోని రెండు రకాల యాంటీబాడీలు నావెల్‌ కరోనా వైరస్‌ను సమర్థంగా తటస్థీకరిస్తున్నాయని సమాచారం. కొవిడ్‌-19 బాధితులకు మెరుగైన చికిత్సా పద్ధతులు రూపొందించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని బ్రిటన్‌లోని రోజాలిండ్‌ ఫ్రాంక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. నేచర్‌ స్ట్రక్చరల్‌, మాలిక్యులర్‌ బయాలజీ జర్నల్‌లో దీనిని ప్రచురించారు.

జంతువుల్లో లేదా మానవుల్లో అభివృద్ధైన వైరస్‌ తటస్థీకరణ ఏంజెట్లను ఉపయోగించి కొవిడ్‌-19 రోగులకు ఉపశమనం కలిగించవచ్చని పరిశోధకులు అన్నారు. 2002-03 నాటి సార్స్‌ యాంటీబాడీలను ఉపయోగించి స్పైక్‌ ప్రొటీన్‌ నుంచి ఏసీఈ2 అనుసంధానాన్ని అడ్డుకోవచ్చని సూచించారు. అయితే అన్ని యాంటీబాడీలు కొవిడ్‌-19కు ఒకేరీతిలో స్పందించడం లేదని పేర్కొన్నారు. 

మనుషుల్లాగే చాలావరకు క్షీరదాల్లో బరువైన, తేలికైన రెండురకాల యాంటీబాడీ గొలుసులు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. లామాస్‌ ఒంటెల్లో మాత్రం అదనంగా బరువైన ఒంటరి యాంటీబాడీ గొలుసు ఉందని దానిని నానోబాడీ అంటారని పేర్కొన్నారు. ఇవి సులభంగా విడుదల అవుతాయని సంప్రదాయ యాంటీబాడీలకు ప్రత్యామ్నాయంగా డయాగ్నస్టిక్స్‌, ఇమేజింగ్‌కు ఉపయోగించుకోవచ్చని సూచించారు.

సారూప్యతలు కలిగిన రెండు రకాల నానోబాడీలు కరోనా వైరస్‌ కొమ్ముల నుంచి ఏసీఈ2 అనుసంధానాన్ని అడ్డుకున్నాయని పరిశోధకులు తెలిపారు. హె11-హెచ్‌4, హెచ్‌11-డీ4 అనే నానోబాడీలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. హెచ్‌11-హెచ్‌4 నానోబాడీలైతే మరింత సమర్థతతో కరోనా వైరస్‌ను తటస్థీకరిస్తున్నాయని వెల్లడించారు. ప్రత్యేకంగా లేదా ఇతర యాంటీబాడీలతో కలిపి నానోబాడీలను ఉపయోగిస్తే రోగుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని