తొందరపాటు

 ‘‘ఇదిగో నాన్నా వాటరు బాటిలు. ఈ బాస్కెట్లో టిఫిన్‌ బాక్స్‌లున్నాయ్‌. చిన్న బాక్స్‌ లోని ఇడ్లీలు ఓ గంటాగి తినెయ్యండి. ఒంటిగంట దాటగానే పెద్దబాక్స్‌లోని చపాతీలూ, పెరుగన్నం తినేసి మందులు వేసేసుకోండి సరేనా.

Updated : 24 May 2020 09:03 IST

- వలివేటి నాగ చంద్రావతి

 ‘‘ఇదిగో నాన్నా వాటరు బాటిలు. ఈ బాస్కెట్లో టిఫిన్‌ బాక్స్‌లున్నాయ్‌. చిన్న బాక్స్‌ లోని ఇడ్లీలు ఓ గంటాగి తినెయ్యండి. ఒంటిగంట దాటగానే పెద్దబాక్స్‌లోని చపాతీలూ, పెరుగన్నం తినేసి మందులు వేసేసుకోండి సరేనా.

కాలక్షేపానికి న్యూసుపేపరూ ఓ నవలా కూడా కొన్నానివిగో. మీరు దేనికీ కిందికి దిగనక్కరలేదు. దిగితే మళ్లీ ఎక్కడానికి కష్టమవుతుంది మీకు. ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది. భోజనమయ్యాక ఓ గంట నడుం వాల్చండి. ఎ.సి. టూ టైరు ఇది. సీటంతా మీరే. కాళ్లు జాపుకు కూర్చోవచ్చు మొహమాట పడకండి. మిమ్మల్నొక్కర్నే పంపడం నాకస్సలు ఇష్టంలేదు. కానీ తప్పట్లేదు.’’

మా పార్థు వంద జాగ్రత్తలు చెబుతున్నాడు. మొదటిసారి పిల్లాడ్ని స్కూలుకు పంపిస్తున్నట్లు తెగ టెన్షన్‌ పడిపోతూ.
వైజాగ్‌ రైల్వేస్టేషన్‌ అది. ‘షాలిమార్‌ ఎ.సి. ఎక్స్‌ప్రెస్‌’ లో విజయవాడ వెళుతున్నాను. రిటైరయినా దృఢంగానే ఉండేవాణ్ణి. ఫ్రీ బర్డ్‌లా తిరిగేవాణ్ణి. ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చినప్పటినుంచీ కాలు కదిపానంటే భయం. నాక్కాదు - ఇంట్లో వాళ్లకి.
‘‘సరే సరే, అలాగే అలాగే’’ అని చెప్పి చెప్పి చెంపలు లాగుతున్నాయ్‌. మొత్తానికి రైలు కదిలింది. ‘‘జాగ్రత్త - వెళ్లగానే ఫోన్‌ - నేను చెప్పినవన్నీ - జ్ఞాపకం’’ పాపం మావాడు వగరుస్తూ వగరుస్తూ బండి వేగాన్నందుకునే వరకూ దాని పక్కనే నడుస్తూ నడుస్తూ, చెప్తూ చెప్తూ...
అమ్మయ్య, పార్థు చూపులకు వెనకబడ్డాడు. ఏమిటో వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కోసారి భరించలేం. కిటికీకి దగ్గరగా జరిగి కూర్చుని, విశ్రాంతిగా సీటుకి జారబడి అలవోకగా కలయజూశాను కంపార్ట్‌మెంటంతా. ఒకటి రెండు సీట్లు మినహా ఫుల్లుగా ఉంది. నా సైడు బెర్తుకి ఎదురుగా ఉన్న సీట్లలో ఓ ఫ్యామిలీ అనుకుంటా - భర్తా భార్యా కొడుకూ కూర్చున్నారు. వాళ్లెదురుగా ఉన్న సీటంతా ఖాళీ. ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి పద్దెనిమిదో ఇరవయ్యో ఉంటుంది వయసు. రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిలయిపోయి చెవికి మొబైల్‌ అతికించేశాడు. ఆవిడేమో ఎక్కినప్పటినుంచీ ఆగకుండా భర్త చెవిదగ్గర మద్దెల వాయిస్తూనే ఉంది. పాపం - ఆ మానవుడు పేపరు తెరిచాడేగానీ అటు దృష్టి దానిమీద పెట్టనూలేక ఇటు పూర్తిగా చెవిదగ్గర మోతకి తల ఊపనూలేక అవస్థ పడుతున్నాడు.
‘‘అమ్మా టిఫిన్‌ పెట్టేస్తావా?’’ ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు.
నాకూ ఆకలి గుర్తొచ్చింది. బాక్స్‌ తెరిచి ఇడ్లీలు తిన్నాను. మావాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను. కాసేపు పేపరు తిరగేశాను. ఇంతసేపూ అతి పలుచని మబ్బుతెరలోంచి కనిపిస్తున్నట్టు, కిటికీ అద్దం వెనకాల నుంచీ ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఓ చిన్న కునుకు పట్టేసింది. ఎంతసేపో తెలీలేదు. ఏదో స్టేషనొచ్చినట్టుంది. దిగేవాళ్లూ ఎక్కేవాళ్ల సందడికి మెలకువ వచ్చేసింది.
పాతవాళ్లెవరు దిగారో కొత్తవాళ్లెవరు ఎక్కారో తెలీలేదుగానీ నా ఎదురు వింగ్‌లో పాత ఫ్యామిలీతోపాటు రెండో కిటికీ దగ్గర ఇంకో కొత్త శాల్తీ కనిపిస్తోంది. నా వయసువాడిలానే అనిపిస్తోంది.
కూతురనుకుంటా, మా పార్థూలాగే తెగ జాగ్రత్తలు చెబుతోంది. ‘‘అబ్బా- సరేలేవే’’ అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన నాలాగే. నవ్వుకున్నాను లోలోపల.
బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయిందా అమ్మాయి. కిటికీలోంచీ ఆ అమ్మాయికి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యధాలాపంగా చూశాను.
‘ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే... ఎవరు చెప్మా?’
అప్పుడే ఆయనా నన్ను చూశాడు. వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనబడ్డాయి. మరోసారి పరీక్షగా చూడబోయాను. ఇటు చూస్తున్నవాడల్లా చటుక్కున అటు తిరిగిపోయాడు. ఉహుఁ సందేహం లేదు. ఆయనకూడా నాకులాంటి డైలమాలోనే పడి ఉంటాడు. ఇంతకీ ఎవరయి ఉంటారబ్బా. దూరబ్బంధువా పూర్వ స్నేహితుడా పాత శత్రువా...
పడుతోన్న మథన అక్కడ ఆగింది. ‘ఆఁ. గుర్తుకొచ్చేసింది. అతను వేణుగోపాలు కదూ? అవును, పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువ్విన క్రాఫు, నుదుటిన పూర్వకాలపు కాణీ కాసంత చుట్టతో కాల్చిన మచ్చ, తెల్ల ప్యాంటుమీద తెల్లషర్టు... సందేహం లేదు. అతను వేణూనే.
‘వేణూ’ ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బైటకురక బోతున్న స్వరం చేదుముద్దేదో అడ్డం పడినట్లు గొంతులోనే ఆగిపోయింది. ‘నాకతను మిత్రుడా?’
ముప్పై ఎనిమిదేళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు- ‘‘నువ్వు నాకు శత్రువ్వి. నీమొహం చూడ్డం కూడా నాకిష్టం లేదు’’ అన్నాడు కోపంగా.
ఆరోజు మానసికంగా తనెంత చిత్రవధ అనుభవించాడు... ఎంత కుమిలిపోయాడు... ఆనాటి బాధ గుర్తొచ్చి గుండె కలుక్కుమంది నాకు.
భావాలు కలగలిసిన జంట కవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్లం. అంత బద్ధ శత్రువుల్లా ఎలా మారిపోయాం?
వేదనగా కళ్లు మూసుకున్నాను. గతంలోకి లాగేసింది మనసు.

*              *             *

ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని స్వంత ఊరికి దగ్గరగా వచ్చాను.
మొదటిరోజు బ్యాంకులో స్టాఫందరూ దూరాన్నించే మందహాసంతో చెయ్యెత్తి విష్‌ చేసి ఊరుకుంటే వేణుమాత్రం దగ్గరకొచ్చి భుజంమీద చెయ్యేసి, ‘‘వెల్‌కమ్‌ మధుగారూ’’ అన్నాడు నవ్వుతూ. ఆ భుజం మీద చెయ్యి వెయ్యటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు.
ఆ సాయంత్రం నేనోగంట పర్మిషనడిగి ఇళ్లవేటకి బయలుదేరుతుంటే, ‘‘అనుకుంటూనే ఉన్నాను మీకు ఇల్లు అవసరమవుతుందని, మేమున్న ఇంటిలో పక్క పోర్షను ఖాళీగా ఉంది. కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలూ ఉన్నాయి, రండి చూద్దురుగాని’’ అన్నాడు.
వెళ్లాను. కొత్త ఇల్లు. అద్దెకివ్వటం కోసమే రెండు పోర్షన్లుగా కట్టారు. బ్యాంకుకి దగ్గరగా ఉంటుందని రెండునెల్ల క్రితమే వేణు కూడా ఈ ఇంటికి మారాడట. ఇల్లు నాకు నచ్చింది. రెండు రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధని.
మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న నాలుగురోజులూ వేణూ ఇంట్లోనుంచే క్యారియరు. ‘‘మాతో పాటు పప్పూ అన్నమే. అంత మొహమాట పడకండి వదినా’’ అంటూ వరస కలిపి మరీ భర్త అంత కలుపుగోలు తనమూ కనబరిచింది వేణు భార్య కమల.
మా గ్యాస్‌ కనెక్షను ట్రాన్స్‌ఫరూ, పిల్లవాడి స్కూలు అడ్మిషనూ, పోస్టాఫీసులో అడ్రసు ఎంట్రీ చేయించటం... ఈ పనులన్నిటికీ వేణు నాకూడా తిరిగాడు. వెంటే ఉన్నాడు. ఎంత విసుగు తెప్పించే కార్యమయినా మనకి సాయంగా ఇంకొక రున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకప్పుడే అనుభవమయింది.
ఒకరిమీద ఒకరికి సుహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తడమేకాదు - చిగుళ్లు వేస్తుంది. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. మా స్నేహమలా ఎదిగింది.
సంతరోజు వాళ్ల కూరలతో పాటు మాకూ ఓ బేగ్‌ తెచ్చి పడేసేవాడు వేణు. మా అబ్బాయి గోపీ స్కూలు ఫీజు కట్టేటప్పుడు వాళ్ల హేమంత్‌ ఫీజు కూడా కట్టేసొచ్చేవాణ్ని నేను. మొదట్లో ‘‘ఎందుకు శ్రమ?’’ అని నొచ్చుకునేవాళ్లం. తర్వాత్తర్వాత ఆ ఫార్మాలిటీస్‌ కూడా మానేశాం.

ఉదయం వాకింగ్‌లో ఆహ్లాదం, సాయంత్రం పార్కు బెంచీ మీద కబుర్లలో రిలాక్సేషన్‌, తోడు ఒకరున్నారనే ధైర్యం, మంచి స్నేహంలో ఉండే మధురిమా నాకు వేణు సహచర్యంలో లభించాయి.
మా కుటుంబాలు కూడా పాలూ నీళ్లలా కలిసిపోయాయి. వేణూ వాళ్లమ్మ భగీరధమ్మగారు వర్ధనిని ‘‘నా కూతురు లాంటి దానివి. నన్ను అమ్మా అని పిలు’’ అనేవారు. థిÅయేటర్‌కి వెళ్లినా, దేవాలయానికి వెళ్లినా కలిసే వెళ్లేవాళ్లం. కలిసిమెలసి ఉండేవాళ్లం.
బంధువులకి మించిన ఆత్మీయుల పొరుగు దొరికిందనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన ముసలం - పుట్టలేదు - వచ్చింది.

*              *             *

ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తున్నట్టే ఇంట్లో కొచ్చిందో అమ్మాయి. ‘‘హలో అన్నయ్యా. అలా చూస్తారేమిటీ నేనూ మీ చెల్లెల్ని. గుర్తుపట్టారా?’’ అంది నన్ను తికమక పెట్టేస్తూ. ఆ వెంటనే, ‘‘సర్లెండి, ఆలోచిస్తూ ఉండండి. నేనీలోపల వదినని టిఫినేంటో అడిగొస్తా’’ అంటూనే వంటింటి వైపు ఎగిరెళ్లిపోయింది.
అప్పుడొచ్చారు భగీరధమ్మగారు నవ్వుతూ. ‘‘హడల గొడుతోందా? అది మా అమ్మాయి పరిమళ, ఎప్పుడూ ఇంతే. వట్టి అల్లరిపిల్ల. దాని ఫ్రెండు పెళ్లి ఈ ఊళ్లోనేనట, మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది. చెప్పా చెయ్యకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది. ఇంటి కొచ్చేటప్పటికి నడిరాత్రి పన్నెండు. ఫోనన్నా చెయ్యకూడదటే అంటే, ఏం హారతి రెడీ చేసేదానివా అంటుంది’’ అన్నారావిడ మురిపెంగా.
వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి. నిమిషానికోసారి మావాటాలో కొచ్చేసి పదేపదే నన్ను ‘‘అన్నయ్యా’’ అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెళ్లు లేని లోటు తీర్చేసింది.
‘‘నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్‌ అంజనీదేవిలా ఉంటావొదినా, అబ్బ ఇల్లెంత నీట్‌గా పెట్టుకున్నావో - పాలొలకపోసి ఎత్తుకోవచ్చు...’’ ఓ ఇల్లాలి మనసు
రంజింప చేయటానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్‌ అవసరంలేదు. మా వర్ధని ప్రసన్నమయిపోయింది.
నేను గమనిస్తూనే ఉన్నాను. మా పడక గదిలోకి ఇతరులు రావటంగానీ మా మంచం మీద కూర్చోవటం, పడుకోవటంగానీ వర్ధనికి అస్సలు గిట్టదు. వాళ్లకర్ధమయ్యేలా ఏదోలాగ తన అయిష్టాన్ని బయటపెట్టేస్తుంది.
‘‘పరిమళ చాలా చొరవగా మా బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోతోంది. బీరువా తీయించి చీరలూ, నగలూ చూసేస్తోంది. ‘‘నీ సెలక్షన్‌ సూపర్బ్‌ వదినా’’ అంటూ బెడ్‌మీద వాలిపోతోంది. అసలు గమ్మత్తేమిటంటే ఈ చర్యల్ని నవ్వుతూ చూస్తుండిపోతోంది వర్ధని.
కళ్లెగరేశాను ‘ఏంటికథ?’ అన్నట్లు.
‘‘ఏమోనండీ, ఏం మెస్మరిజం చేస్తోందోకానీ ఆ అమ్మాయినేమీ అనలేకుండా ఉన్నాను’’ అని నిట్టూర్చింది. ఆ మాట మాత్రం నిజం. తను చెయ్యాలనుకున్నది మన అయిష్టాన్ని బయట పెట్టేలోగానే చేసేస్తోంటే ఏమనగలం. ఎలా కాదనగలం?
పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసిందింకోసారి.

*              *             *

‘‘ఎలా ఉన్నానొదినా?’’ మెరూన్‌ కలర్‌ పట్టుచీర, తలనిండా పూలు... చక్కగా ముస్తాబయి వచ్చింది పరిమళ. రాత్రి పదిగంటలకట స్నేహితురాలి పెళ్లి ముహూర్తం, తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయిపోతోంది.
బ్యాంకునించొచ్చి పడకకుర్చీలో రిలాక్సవుతున్నాను. టీ అందిస్తోంది వర్ధని.
‘‘నువ్వే పెళ్లికూతుర్లా ఉన్నావ్‌’’ ముచ్చటగా చూస్తూ నవ్వింది.
‘‘హారం బావుందా?’’
‘‘చాలా బావుంది. ఆ చెవులకే కొంచెం వేలాడే మోడల్‌ ఉండే బావుంటుందేమో’’
కొంప మునిగిందక్కడే. ‘‘అవునుకదా, మరింకా నుంచుంటావేం. పదా, నీ బుట్టలోలాకులు తెచ్చివ్వుమరీ...’’ వర్ధనిని బలవంతానా బెడ్‌రూమ్‌లోకి తోసుకువెళ్లి పదినిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకు వచ్చి, ‘‘బై అన్నయ్యా, తెల్లవారుజామున లేపుతాను సెండాఫ్‌ ఇవ్వాలి సుమా’’ అంటూ గాలి దుమారంలా వెళ్లిపోయింది పరిమళ.
నిశ్చేష్టత నుంచి తేరుకుని చూశాను వర్ధని వివర్ణమయిన ముఖాన్ని, చాలా బాధేసింది. వాళ్ల అమ్మమ్మవట ఆ బుట్టలు. అవంటే వర్ధనికి చిన్నప్పటి నుంచీ చాలా మోజట. అది తెలిసి ఆ బుట్టల్ని ‘‘చాలా ఖరీదైనవి జాగ్రత్త సుమా,’’ అని చెప్పి మరీ వర్ధని పెళ్లి కానుకగా ఇచ్చిందావిడ. వర్ధనికి అవంటే ప్రాణం. వాటిని ఎవరినీ తాకనివ్వదు, పెట్టుకోనివ్వదు. అలాంటిది...
‘‘ఒక రోజు ఓపిక పట్టు’’ ఓదార్పుగా చూశాన్నేను.
తెల్లారుజామున వేణూ పరిమళా తలుపుతట్టారు. ప్రసన్నంగానే బై చెప్పింది వర్ధని నాతోపాటు. కానీ ఆ కళ్లు ఇంకెందుకోసమో ఎదురుచూస్తున్నట్టు తారట్లాడినయ్‌. పూర్తిగా తెల్లారింది, పొద్దెక్కుతోంది. వర్ధని సహనం అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి.
‘‘ఆ హద్దు కూడా దాటిందనుకుంటా - హాల్లోకి విసురుగా వచ్చి ‘‘వాళ్లకు కాస్తన్నా ఇంగితముండక్కర్లా! తీసికెళ్లిన నగ...’’ వర్ధని వాక్యం పూర్తి చెయ్యలేదు - వచ్చేశారు భగీరధ]మ్మగారు.
‘‘నేను చెబుతూనే ఉన్నానమ్మాయ్‌. ఎరువు సొమ్ము బరువుచేటూ అని. మొండిపిల్ల విన్నదా అందరూ తనలాంటి వెర్రిబాగులవాళ్లే అనుకుంటుంది. నువ్వన్నమాట నిజం. ఇంగిత జ్ఞానమున్న పిల్లయితే నిన్ను బుట్టలు అడిగేదేకాదు. జాగ్రత్త లేకుండా ఉండేదేకాదు. ఏమనుకోకమ్మాయ్‌. రాత్రి పెళ్ళిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదట. మరేం పర్లేదు. నువ్వేం బెంగ పెట్టుకోకు. ‘మహేశ్వరీ ఫ్యాన్సీ షాపులో అంతకన్నా కొత్త మోడల్స్‌ చూశానంది కమల. నీకిష్టమొచ్చినవి తెచ్చుకో. రెండు వందలు ఎక్కువైనా ఫరవాలేదు’’ అందావిడ నిష్టూరానికి కోపం కలగలిపి.
ఉలిక్కి పడ్డాం ఇద్దరం. ‘‘అవి ఫ్యాన్సీవి కావండీ, ప్యూరు గోల్డువి. ఆ కెంపులూ పచ్చలూ కూడా జాతివి’’ కెవ్వున కేక పెట్టినట్టే అంది వర్ధని ఆవేశం అణచుకోలేక.
ఈసారి ఉలిక్కిపడటం భగీరధ]మ్మగారి వంతు. మా నడుమ అగాధం ఏర్పడడానికి అదే మొదలు.
మా ఇద్దరి వంటిళ్ల మధ్యన ఒక పలుచటి గోడే అడ్డంగా ఉంటుంది. ఆ గోడకి చెవి ఆన్చి వింటోంది వర్ధని.
‘‘ఎప్పుడూ లేంది ఈ అలవాటేమిటి?’’ చిరాగ్గా అన్నాను.
‘‘వాళ్లని బట్టే నా అలవాటు మారింది. ఆ పెద్దావిడ ఏమంటోందో విన్నారా? నాకు బుద్ధిలేదట. అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాదే తప్పట. అత్తకు తగ్గ కోడలు - ఆవిడేమంటోందో తెలుసా? అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావటంలేదట. మనం వినాలనే అంటున్నట్టనిపించింది నాకు.’’
నిర్ఘాంతపోయాను.
ఆ సాయంత్రం, ‘‘అలా బజారుదాకా వెళ్లొద్దాం పద,’’ అని వేణూని జ్యూయలరీ షాపుకి తీసుకెళ్లాను. అక్కడి షరాబుకి మిగిలున్న ఆ జుంకాని చూపించాను. నా ఉద్దేశం అవి బంగారపువే అని నిరూపిద్దామని మాత్రమే. కానీ అంతలోనే వేణు ‘‘దాని జత చేయాలంటే ఎంతవుతుందో చెప్పండి’’ అన్నాడు.
షాపుకి వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే. ‘‘ఫరవాలేదులే, సొమ్ము విషయంలో ఆమాత్రం జాగ్రత్త పడటంలో తప్పులేదు’’ అంటాడు. ‘‘తల తాకట్టు పెట్ట యినా వీలయినంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను. నన్ను నమ్ము’’ అనేసి నన్ను షాపు దగ్గరే వదిలేసి వెళ్లిపోయాడు వేణు.
ఆ తర్వాత అతను నేను పలకరించినా ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు. నిన్నటిదాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైకుమీదే బ్యాంకుకి వెళ్లేవాళ్లం. ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్లిపోతున్నాడు. పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్‌ దగ్గరకు వచ్చేసే వేణు నేనెవరినో తెలీనట్టు నా పక్క నుంచే వెళ్లిపోతున్నాడు. ‘కృష్ణార్జునుల మధ్య చిచ్చురేపిన గయుడెవరబ్బా’ అనే గుసగుసలు వింటుంటే ప్రాణప్రదమయినదేదో పొగొట్టు కుంటున్నట్టు దిగులుగా ఉంటోంది. కొంత మందిని అప్పు అడిగినట్టూ లోన్‌కి అప్లయి చేసినట్టూ తెలిసి ప్రాణం గిలగిల్లాడింది.
‘‘నువ్వేం ఆ నగ చేయించక్కర్లేదు. నాతో మునపట్లావుండు’’ అని ప్రాధేయ పడాలని పిస్తోంది. కానీ, ‘‘ఊర్కోండి. రూపాయా రెండా? లక్షల ఖరీదు. మళ్లీ మనం చేయించు కోగలమా. ఏం పర్వాలేదు. ఇవ్వనివ్వండి’’ నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్ధని. అది తన సొమ్ము. మాట్లాడలేకపోతున్నాను.
రాను రానూ పక్క పక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర. మావాడూ, హేమంతూ కలిసి ఆడుకుంటుంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తోందట. వేణూకి జ్వరం వస్తోందని పనిమనిషి అంటూంటే విని ఆగలేక చూద్దామని వెళ్లాను. భగీరధ]మ్మగారు గుమ్మంలోనే ఎదురయింది. ‘‘నిద్రపోతున్నాడు నాయనా’’ అంది గడపలో అడ్డంగా నుంచుని ఇక వెళ్లమన్నట్టు. హతాశుడనయ్యాను. ‘‘ఏదయినా అవసరమొస్తే పిలవండి అమ్మా’’ అన్నాను. ‘‘వద్దులే నాయనా ఇప్పటికే రుణగ్రస్తులమయ్యాం’’ అంది మొహం ముడుచుకుని.
ఈ కావేషాలకి తోడు పనిమనిషో, ఇంకో పొరుగింటామో మరో రెండు సమిధలు వేస్తున్నట్టున్నారు- ‘‘మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట. హుఁ సొమ్మిచ్చి చెడయిపోయాం’’ సణుగుతోంది వర్ధని. ‘‘ఏమయినా అనుకోనీ, నగ ఇస్తే చాలు’’ అని దేవుడికి మొక్కుకుంటోంది.
వారం తిరిగింది - ఉహుఁ ఏడు యుగాలు గడిచాయి.
శనివారం నాకు ఆఫ్‌. ఇంట్లోనే ఉన్నాను. భగీరధమ్మగారు చరచరా ఇంట్లోకి వచ్చారు.
‘‘ఇదిగో వర్ధనీ నీ లోలాకు. పట్టుచీర పమిటచెంగు జరీలో చిక్కుకుందట. హడావిడి పిల్ల చూసుకోలేదు. వాళ్ల మరిది వస్తోంటే పంపించింది పరిమళ’’ అన్నారు ఆనందంగా.
ఆవిడ చేతిలో బుట్టచూసి వర్ధని మొహం విప్పారింది. అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను. ఎదురు చూశాను కానీ...
మరో వారం తరువాత అగ్గిమీద గుగ్గిలంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు. ‘‘నువ్వు నాకు స్నేహితుడివి కాదు శత్రువ్వి. నలుగుర్లో మమ్మల్ని తలెత్తుకోనీకుండా చేశావు. మిత్రదోహివి నువ్వు’’ పిడుగుల వర్షం కురిపించాడు.
ఊహించని శరాఘాతం. వేణూలో ఎప్పుడూ చూడని భీకరాకారం. కారణం చెప్పకుండా ఏమిటీ దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తోంది. ‘‘ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మనరేమండీ?’’ అంటోంది వర్ధని.
‘‘మా మర్యాద మంట గలిపిన వాళ్లకి మర్యాద ఇవ్వాలా? మేం నీ బోడి లోలాకు దాచేసుకుని పోయిందన్నామా, తప్పక వచ్చే సరికి బయట పెట్టామా? నోరెలా వచ్చింది అంత అపవాదు వెయ్యటానికి’’ విసవిసా వచ్చి అందుకున్నారు భగీరధ]మ్మగారు.
‘మేమలా అనలేదని’ మేము, ‘నిప్పులేందే పొగెలా వస్తుంది? ఒక్కొక్కరూ వచ్చి, మీరిలా చేశారట గదా అని అడుగుతోంటే ప్రాణం చచ్చిపోతోంది!’ అని వాళ్లు... ‘ఎవరలా అన్నదీ’ అంటే జవాబుండదు. ఎన్నినోర్లూ, ఎన్ని చెవులూ దాటి వచ్చిందో ఆ పుకారు. ఎవరని చెబుతారు? ఎవరిస్తారు సాక్ష్యం?

సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్లకు నమ్మకం. జగడం ముదిరింది. హద్దు దాటింది. మాటకి మాట తెగులు. వాళ్లు నాలుగన్నారు మేము పదన్నాం.
ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి, మీరన్నది నిజమే, నిప్పులేనిదే పొగరాదు. అది నిజమేనేమో, మీరా పని చేసుండకపోతే ఈ ఉలుకెందుకు!’’ అని మాట తూలాను.
‘‘ఆ మాటతో దిమ్మెరపోయినట్టుగా అయ్యాడు వేణు. మరుక్షణం తేరుకుని ఛీ, నీ మొహం చూడ్డం పాపం’’ అంటూ కళ్లకు చెయ్యడ్డం పెట్టుకుని వెళ్లిపోయాడు రుసరుస లాడుతున్న తల్లిని వెంటపెట్టుకుని.
రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు వాళ్లు. మూడురోజుల సెలవుల అనంతరం బ్యాంకుకి వెళితే తెలిసింది - వేణు లాంగ్‌లీవ్‌ పెట్టాడని. రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకున్నాడని.
అప్పుడలా దూరమయిన నా స్నేహితుణ్ణి మళ్లీ ఇప్పుడే చూస్తున్నాను.

 

*              *             *

కళ్లు విప్పాను - ఏదో నిర్లిప్తత, వైరాగ్యం జీవితపు చరమాంకంలో గతావలోకనం. తప్పొప్పుల సమీక్ష.
ఎన్ని అనుభవాలు... చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు... తొందరపాటులో పొగొట్టుకున్న వరాలు... అలా కాలదన్నుకున్న ఒక వరం వేణు మైత్రి.
ఆరోజు ఇద్దరం కాస్సేపు ఆవేశం తగ్గించుకుని శాంతంగా ఆలోచించుకుని ఉంటే, పుట్టిందంటే పురుగులు పట్టాయని కథలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కాదూ.
ఫూలిష్‌గా చెప్పుడు మాటలకు చెవి ఒగ్గకుండా ఉండివుంటే అప్పుడే అపార్ధాల మబ్బులు చెల్లా చెదురయ్యేవి కాదూ. ఇన్నేళ్లకి కళ్లబడిన ప్రాణమిత్రుడికి ఇలా దూరదూరంగా కూర్చోవాల్సిన అగత్యముండేది కాదుకదూ.
ఇప్పుడు మాత్రమేమి - ఎవరు ఆపారు నన్ను? అపురూపమయిన స్నేహాన్ని చిన్న శంకతో వాడూ, క్షణికావేశంలో మాట జారి నేనూ చేజార్చుకున్నామే అని గతంలో తరచి తరచి ఎంతలా వగచాను? తీరా ఎదురుపడితే ఎందుకీ బింకం! అతనే దగ్గరకు రావాలనీ పంతమా! వయస్సు ముమ్మరంలో కళ్లు కప్పేసిన ఆవేశ కావేషాలు ఇంకా అలాగే ఉన్నాయా.
వయస్సు పైబడి వృద్ధుణ్ణయ్యాను గానీ, ప్రవచనాలెన్ని విన్నా జ్ఞానవృద్ధుణ్ణి కాలేకపోయానా? ఈ భూమిమీద ఉండేదిక నాలుగురోజులే అని తెలుస్తున్నా అహంభావం, అహంకారం నాలో అణగనేలేదా? దిగ్గున లేచాను. నెమ్మదిగా వేణు దగ్గరగా వెళ్లాను. భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా.
‘‘వేణూ... నామీద కోపం ఇంకా పోలేదా?’’
తలెత్తిన వేణు కళ్లనిండా స్నేహామృతం. మరు నిమిషం నేను వేణు పరిష్వంగంలో ఉన్నాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని