ఇళ్లు దాటితే హీరోలు కాదు.. ఇడియట్స్‌

ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్న వారిని ఫ్రాన్స్‌ ఇంటీరియర్‌ మంత్రి ‘ఇడియట్స్‌’ అని విమర్శించారు. పరిస్థితులు కట్టుతప్పేలా కనిపిస్తోంటే నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే విధించిన రెండు వారాల లాక్‌డౌన్‌ను....

Published : 21 Mar 2020 00:52 IST

ముంబయి: ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్న వారిని ఫ్రాన్స్‌ ఇంటీరియర్‌ మంత్రి ‘ఇడియట్స్‌’ అని విమర్శించారు. పరిస్థితులు కట్టుతప్పేలా కనిపిస్తోంటే నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే విధించిన రెండు వారాల లాక్‌డౌన్‌ను ఆ దేశంలో మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది.

వైద్యసేవల తరహాలో అత్యవసరమైన వాటికే బయటకు రావాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్‌ మేక్రాన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మరే సందర్భంలోనూ ఇంటి నుంచి అడుగు బయట పెట్టొదని స్పష్టం చేశారు. గుమిగూడటం నిషేధమని గుర్తుచేశారు. నిబంధనలు పాటించాలని చెప్పినా చాలామంది బయటకు రావడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, గుమిగూడటం వంటివి చేస్తుండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తును తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదన్నారు. బహిరంగ మార్కెట్లలో జనాలు గుమిగూడుతున్నారని జర్నలిస్టులకు వివరించారు.

ప్రజలు ముప్పును అర్థం చేసుకోవాలని ఇంటీరియర్‌ మంత్రి క్రిస్టోఫె కాస్ట్‌నర్‌ కోరారు. ‘కొందరు ఆధునిక హీరోలం అనుకుంటూ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నారు. నిజానికి వారు ఇడియట్స్‌’ అని యూరప్‌ 1 రేడియోలో ఆయన అన్నారు. ఇక దేశమంతా మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే సముద్ర తీరాల సందర్శనపై నిషేధం విధించారు. ‘కొందరు బయట తిరుగుతూ వారినే కాకుండా కుటుంబ సభ్యులు, ప్రేమించేవారినీ ముప్పులోకి నెట్టేస్తున్నారు. వారు అనాలోచితంగా ప్రవర్తిస్తున్నా వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు’ అని క్రిస్టోఫె అన్నారు. ఇక నిలువ నీడలేని వారికోసం పారిస్‌లోని హోటల్‌ గదులను అద్దెకు తీసుకొని వారికి అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని