కరోనా: వీడియోకాల్‌లోనే తండ్రి అంత్యక్రియలు

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎంతోమందిని తమ కుటుంబాల నుంచి దూరం చేస్తోంది. మరెన్నో కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. ప్రాణాంతక వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో కరోనా బాధితులను నిర్బంధంలో ఉంచుతున్నారు.

Updated : 16 Mar 2020 10:56 IST

తిరువనంతపురం(కేరళ): కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎంతో మందిని తమ కుటుంబాల నుంచి దూరం చేస్తోంది. మరెన్నో కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. ప్రాణాంతక వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో కరోనా బాధితులను నిర్బంధంలో ఉంచుతున్నారు. ఈ క్రమంలో కేరళలో ఓ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తన తండ్రిని చూడాలని ఖతార్‌ నుంచి వచ్చిన యువకుడు చివరి చూపునైనా నోచుకోలేకపోయాడు. ఆ యువకుడికి కరోనా సోకడంతో తండ్రి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఇంతలోనే అతని తండ్రి మరణించాడు. ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కన్నతండ్రిని చివరి సారి చూసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని కన్నీటి పర్యంతమయ్యాడు.

కేరళకు చెందిన లినో అబెల్‌(29) ఖతార్‌లోని దోహాలో ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. తండ్రికి గుండెపోటు వచ్చిందని తెలియడంతో మార్చి 8న హుటాహుటీన బయలు దేరి వచ్చాడు. అతను వచ్చింది కరోన ప్రభావిత ప్రాంతం నుంచి కావడంతో ఇక్కడ దిగగానే ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఎవర్నీ కలవకుండా నేరుగా కొట్టయాంలోని తన తండ్రి ఉన్న ఆసుపత్రికి చేరుకున్నాడు. ఎంతైనా కన్నతండ్రి కదా..! తన తండ్రిని ఎలాగైనా చూడాలని అనుకున్నాడు. ఇంతలోనే తన కుటుంబం, స్నేహితులు గుర్తుకు వచ్చారు. తన వల్ల ఈ వైరస్‌ ఇతరులకు సోకితే ఇంకా ఎక్కువగా బాధపడాల్సి వస్తుందని భావించి వైద్యుడిని సంప్రదించాడు. కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఐసోలేషన్‌ వార్డుకు చేరాడు. ఆ మర్నాడే (మార్చి 9న) అతని తండ్రి మరణించాడు. విషయం తెలుసుకున్న అబెల్‌ తన తండ్రిని ఆఖరి చూపు చూడాలనుకున్నాడు. కానీ, మళ్లీ అతనికి కుటుంబం గుర్తుకు వచ్చింది. దీంతో.. ఆఖరికి తండ్రి మృతదేహాన్ని అంబులెన్సులో తరలిస్తున్న దృశ్యాన్ని కిటికీలో నుంచి చూడగలిగాడు. కానీ, ఆయన ముఖాన్ని మాత్రం చూడలేకపోయానని కన్నీరు పెట్టుకున్నాడు. అబెల్‌ పరిస్థితి చూసి చలించిపోయిన వైద్యులు కనీసం తండ్రి అంత్యక్రియలైనా చూపించాలని నిర్ణయించారు. అలా వీడియో కాల్‌ ద్వారా చివరి కర్మను అబెల్‌ చూడగలిగాడు.

తన బాధను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ‘నేను కావాలనుకుంటే నేరుగా వెళ్లి మా తండ్రిని కలిసేవాడిని. కనీసం చివరి చూపైనా దక్కేది. కానీ, నేను చేయాలనుకోలేదు. ఎందుకంటే నాకు వచ్చింది ప్రాణాంతక వైరస్‌ అని నాకు తెలుసు. అది ఇతరులకు వ్యాపించడం నాకు ఇష్టం లేదు. నేను ఐసోలేషన్‌లో చేరి వైరస్‌ నుంచి బయటపడితే నా కుటుంబం, స్నేహితులతో సంతోషంగా ఉండవచ్చు’ అని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. దీంతో సోషల్‌ మీడియా మొత్తం అబెల్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం స్పందించి ఆయనను మెచ్చుకున్నారు. ‘ఇది చాలా విషాదకర పరిస్థితి. ఆసుపత్రిలో తన తండ్రిని చూడటానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ఆ యువకుడు ఆయన్ని కలవలేకపోయాడు. అయితే, వైరస్‌ లక్షణాలున్నాయని తెలియగానే స్వీయ నిర్బంధం చేసుకొని ఆదర్శప్రాయమయ్యాడు. అతన గుండె ధైర్యం, సమాజం పట్ల నిబద్ధత, బాధ్యతను ఈ సంఘటన తెలియజేస్తోంది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అయితే, ప్రస్తుతం అతనికి పరీక్షలు చేసిన వైద్యులు కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధారించారు. దీంతో ‘ఇప్పుడు తాను వైరస్‌ను జయించినందుకు సంతోషించాలో.. లేక తన తండ్రిని చివరి చూపు దక్కనందుకు బాధపడాలో అర్థం కావడం లేదని’ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని