అమరావతిలో రైతుల దీక్షలు..వైకాపా ర్యాలీ

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతలు దీక్షలు కొనసాగుతున్నాయి.మరో వైపు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై కొన్నిరోజులక్రితం దాడి జరిగిందంటూ వైకాపా ర్యాలీ చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

Updated : 28 Feb 2020 13:01 IST

అమరావతి: రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతలు దీక్షలు కొనసాగుతున్నాయి.మరో వైపు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై కొన్నిరోజులక్రితం దాడి జరిగిందంటూ వైకాపా ర్యాలీ చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మద్దతుగా ర్యాలీలో నినాదాలు చేశారు. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల మీదుగా ..రైతుల దీక్షా ప్రాంగణాల ముందు నుంచి వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. రైతుల దీక్షా శిబిరాల వద్దకు రాగానే ‘జై జగన్‌’ అంటూ వైకాపా కార్యకర్తలు నినాదాలు చేయగా.. అందుకు ప్రతిగా రైతులు, మహిళలు ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. పోటా పోటీ నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైకాపా ర్యాలీ దృష్ట్యా మందడం, వెలగపూడిలో పోలీసులు భారీగా మోహరించారు.  న్యాయం చేయాలని కోరుతూ 73 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ...వైకాపా శ్రేణులతో ర్యాలీనిర్వహించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టే విధంగా ర్యాలీ నిర్వహించిన నేతలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.

రైతు కూలీ మృతి..
రాజధాని ప్రాంతంలో రైతు కూలీ కోటయ్య గుండెపోటుతో మృతి చెందారు. మందడం గ్రామానికి చెందిన కోటయ్య... గత కొన్ని రోజులుగా అమరావతికి మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోటయ్య మృతదేహానికి అమరావతి ఐకాస నాయకులు, రైతులు నివాళులర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని