ఆర్టీసీ బస్సులో భీష్మ చిత్ర ప్రదర్శన

యువ కథానాయకుడు నితిన్‌ నటించిన కొత్త చిత్రం భీష్మ పైరసీ బారిన పడింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు తన మొబైల్‌లో చిత్రీకరించి ట్విటర్‌ ద్వారా ఆ చిత్ర బృందానికి పంపించాడు.

Updated : 28 Feb 2020 09:36 IST

పైరసీ చిత్రాలు వేయవద్దని రవాణా మంత్రికి సూచించిన కేటీఆర్‌

 హైదరాబాద్‌: యువ కథానాయకుడు నితిన్‌ నటించిన కొత్త చిత్రం భీష్మ పైరసీ బారిన పడింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు తన మొబైల్‌లో చిత్రీకరించి ట్విటర్‌ ద్వారా ఆ చిత్ర బృందానికి పంపించాడు. నటుడు నితిన్‌ ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్‌లోని పైరసీ వ్యతిరేక విభాగం దృష్టికి తీసుకెళ్లారు. ఆ విభాగం ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ఈనెల 21న విడుదలకాగా.. విడుదలైన నాలుగో రోజే ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని, ఇతర మాధ్యమాలు, సామాజిక వేదికల్లో విస్తరించకుండా చర్యలు చేపట్టాలని పోలీస్‌ అధికారులను కోరారు.

టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ గురువారం ట్విటర్‌లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కు సూచించారు. భీష్మ చిత్రాన్ని ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని ఆ చిత్ర దర్శకుడు ట్విటర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే కేటీఆర్‌ స్పందించి.. మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని