కియా ప్లాంట్‌ ఎక్కడికీ వెళ్లదు: బుగ్గన

కియా ప్లాంట్‌ను తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది ఎక్కడికీ వెళ్లడం లేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం...

Updated : 06 Feb 2020 20:24 IST

అమరావతి: కియా ప్లాంట్‌ను తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది ఎక్కడికీ వెళ్లడం లేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కియా పరిశ్రమ యాజమాన్యం సంతృప్తికరంగా ఉన్నప్పుడు..ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ ప్లాంట్‌ ఏపీ నుంచి తరలిపోతోందంటూ వచ్చిన వార్తలపై కియా సంస్థ ప్రతినిధులు కూడా ఖండించినట్లు ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. రూ.14వేల కోట్లతో కియా ప్లాంట్‌ ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము అనవసర ప్రచారం చేసుకోవడం లేదని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1252 కంపెనీలకు ఏపీఐఐసీ భూములు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. కియా ప్లాంటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తోందన్నారు. జీఎస్టీ వసూళ్లు తమ ప్రభుత్వ హయాంలో పెరిగాయని చెప్పారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని.. ఇలాంటి ధోరణిని నియంత్రించాల్సిన అవసరం ఉందని బుగ్గన అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని