జలకాలాడారు.. జరిమానా కట్టారు

స్నానం చేసినందుకు ఫైన్‌ కట్టడమేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. వియత్నాంలో స్నానం చేసిన ఇద్దరికి ట్రాఫిక్‌ పోలీసు అధికారులు జరిమానా విధించారు. ఇంతకీ వాళ్లిద్దరూ స్నానం చేసింది ఎక్కడో తెలుసా..?

Published : 28 Jan 2020 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్నానం చేసినందుకు ఫైన్‌ కట్టడమేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. వియత్నాంలో స్నానం చేసిన ఇద్దరికి ట్రాఫిక్‌ పోలీసు అధికారులు జరిమానా విధించారు. ఇంతకీ వాళ్లిద్దరూ స్నానం చేసింది ఎక్కడో తెలుసా..? ఏ బాత్రూమ్‌లోనో కాదు.. చెరువులోనో.. కాలువలోనో కాదు. నడి రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళుతూ వారిద్దరూ స్నానం చేశారు. ఇద్దరి మధ్యలో నీళ్ల బకెట్‌ పెట్టుకొని సబ్బు రుద్దుకొని మరీ స్నానం చేశారు. ఒకరు వాహనం నడిపిస్తుండగా వెనకాల కూర్చున్న మరో వ్యక్తి తలపై నీళ్లు పోస్తూ.. రోడ్డుపై వెళుతూనే ఈ తతంగమంతా కానిచ్చారు. దీన్ని మరో వాహనదారుడు వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అలా.. ట్రాఫిక్‌ పోలీసులకు చేరడంతో బండి నంబరు ఆధారంగా వాళ్లను గుర్తించారు. నీటిని వృథా చేయడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలు విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వాళ్లిద్దరికీ జరిమానా విధించారు. వాళ్లు చేసిన ఈ ఘనకార్యానికి ఏకంగా 80 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశమివ్వాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని