Pathetic Conditions: నడుములోతు నీటిలో వ్యక్తి అంత్యక్రియలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 24 మంది మృతిచెందారు. 1250 గ్రామాలను వరదలు చుట్టుముట్టగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు....

Updated : 09 Aug 2021 01:20 IST

భోపాల్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 24 మంది మృతిచెందారు. 1250 గ్రామాలను వరదలు చుట్టుముట్టగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా వెలుగుచూసిన ఓ వీడియో అక్కడి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. నడుములోతు వరద నీటిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

గుణ జిల్లాలోని భదౌరా గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. గ్రామానికి చెందిన కమర్‌లాల్ షెక్యావర్‌ అనే వ్యక్తి మరణించాడు. వరద ఉద్ధృతి తగ్గుతుందేమోనని వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. గత్యంతరం లేని బంధువులు నీటిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. నడుములోతు ఉన్న వరద నీటిలో దిగి కమర్‌లాల్‌ భౌతికకాయాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. కేవలం ఈత వచ్చిన వారే ఇందుకు హాజరయ్యారు.

ఈ అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టలేదని, సరైన డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లను నిర్మించలేదని మండిపడుతున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు శనివారం షెయోపూర్‌లో చేదు అనుభవం ఎదురైంది. నిరసన తెలుపుతూ స్థానికులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. నల్ల జెండాలను ప్రదర్శిస్తూ ఆయన వాహనంపై మట్టిని విసిరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని