మీ నోటి నుంచి దుర్వాసన? అయితే జాగ్రత్త..!

నోటి దుర్వాసన చికాకు పెట్టే సమస్య. నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందికి గురిచేస్తుంది. ఇది ఎవరికైనా, ఏ వయసులోనైనా

Published : 07 Mar 2021 16:40 IST

నోటి దుర్వాసన చికాకు పెట్టే సమస్య. నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందికి గురిచేస్తుంది. ఇది ఎవరికైనా, ఏ వయసులోనైనా రావొచ్చు. చాలావరకిది మామూలుదే గానీ కొన్నిసార్లు ఇతరత్రా జబ్బులకూ సంకేతం కావొచ్చు.

నోటి దుర్వాసనకు ప్రధాన కారణం దంతాలు, నాలుక మీద బ్యాక్టీరియా పెరగటం. ఉదయం లేవగానే కొద్దిగా చెడు వాసన రావటం సహజమే. నోరు తెరచి నిద్రపోయేవారిలో ఇది మరింత ఎక్కువ. ఇలాంటివారిలో నోరు ఎండిపోయి, బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి వీలు కల్పిస్తుంది. నోట్లో నివసించే బ్యాక్టీరియా గంధకంతో కూడిన రసాయన పదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. చాలా జిగటగా ఉండే ఇవి కుళ్లిపోయిన గుడ్డు, ఉల్లిగడ్డ మాదిరి వాసన కలిగుంటాయి. ఇది దుర్వాసనకు దారితీస్తుంది. పళ్లు తోముకుంటే పోతుంది. ఒకవేళ పళ్లు తోముకున్నా, మౌత్‌వాష్‌తో పుక్కిలించినా వాసన పోనట్టయితే ఇతరత్రా సమస్యలకు సంకేతం కావొచ్చని అనుమానించాల్సి ఉంటుంది.

* పళ్ల మీద స్థావరముండే బ్యాక్టీరియా క్రమంగా పళ్లు పుచ్చిపోవటానికి, చిగుళ్లజబ్బుకు దారితీయొచ్చు. ఇవీ దుర్వాసన పుట్టుకొచ్చేలా చేయొచ్చు.

* ముక్కు చుట్టుపక్కల గాలిగదులు, గొంతు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లతోనూ నోరు చెడు వాసన కొట్టొచ్చు.

* మనం వదిలేది ఒక్క గాలినే కాదు. ఇందులో ఇతరత్రా వాయువులూ ఉంటాయి. ఒంట్లోని అవయవాల నుంచి వెలువడే వాయువులు ముందుగా రక్తంలో కలిసి ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. ఇవి శ్వాస ద్వారానే బయటకు వస్తాయి. దీంతో ఇతర అవయవాల జబ్బుల ఆనవాళ్లూ శ్వాసలో కనిపిస్తుంటాయి. ఉదాహరణకు- మధుమేహం నియంత్రణలో లేనివారి శ్వాస పండ్లు లేదా కుళ్లిపోయిన యాపిళ్ల మాదిరి వాసన రావొచ్చు.

* తీవ్రమైన కాలేయ జబ్బుతో బాధపడేవారిలో శ్వాస చెడు వాసనతో కూడుకొని ఉండొచ్చు. లేదూ వెల్లుల్లి, కుళ్లిపోయిన గుడ్ల వంటి వాసన రావొచ్చు.

* అరుదుగా అవయవాల వైఫల్యంతోనూ దుర్వాసన తలెత్తొచ్చు. కిడ్నీ విఫలమైనవారి శ్వాసలో అమ్మోనియా లేదా మూత్రం వాసనతో కూడుకొని ఉండొచ్చు.

డాక్టర్‌ను సంప్రదించటం మేలు

నోటి దుర్వాసన అనగానే రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కొందరు కిళ్లీ, వక్కల వంటివీ నములుతుంటారు. ఇవి దంత సమస్యలు మరింత తీవ్రమయ్యేలా చేయొచ్చు. కాబట్టి ఇటీవలే కొత్తగా లేదూ ఇబ్బంది పెట్టేలా నోటి దుర్వాసన వస్తున్నట్టయితే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి కారణాన్ని తెలుసుకోవటం మంచిది. ముందుగా పంటి డాక్టర్‌ను సంప్రదించటం ఉత్తమం. నోటిని పరీక్షించి దంతాలు, చిగుళ్ల సమస్యలేవైనా ఉన్నాయేమో పరిశీలిస్తారు. అవసరమైతే ఇతరత్రా పరీక్షలు చేయిస్తారు. ఏవైనా జబ్బులు కారణమవుతున్నట్టయితే వాటికి చికిత్స తీసుకుంటే దుర్వాసనా తగ్గుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని