చైనా యూనివర్సిటీలో వర్చువల్‌ విద్యార్థిని!

చైనాలో పలు టెక్నాలజీ సంస్థలు కలిసి ఏకంగా భౌతిక ప్రపంచానికి సంబంధం లేని ఒక వర్చువల్‌ విద్యార్థినిని రూపొందించాయి. అదీ కూడా కృత్రిమ మేథతో రూపొందించిన వర్చువల్‌ విద్యార్థిని

Updated : 29 Jun 2023 16:15 IST


(Photo: Tsinghua University Youtube Screenshot)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా విద్యాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులంతా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. పాఠాలు, పరీక్షలు, సెమినార్లు.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉన్నా.. విద్యార్థులు మాత్రం ఇంటి నుంచి స్వయంగా పాల్గొనాల్సిందే. అయితే చైనాలో పలు టెక్నాలజీ సంస్థలు కలిసి ఏకంగా భౌతిక ప్రపంచానికి సంబంధం లేని ఒక వర్చువల్‌ విద్యార్థినిని రూపొందించాయి. అదీ కూడా కృత్రిమ మేథతో రూపొందించిన వర్చువల్‌ విద్యార్థిని. ఇటీవల ఆమె సింఘువా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులో అడ్మిషన్‌ సంపాదించింది.

హువా హైబింగ్‌.. చైనాలో కృత్రిమ మేథ కలిగిన తొలి వర్చువల్‌ విద్యార్థినిగా గుర్తింపు పొందింది. హువాను బీజింగ్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(బీఏఏఐ), జైఫు ఏఐ, షియోఐస్‌ సంస్థలు కలిసి రూపొందించాయి. ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకునేలా శాస్త్రవేత్తలు ఆమెను తీర్చిదిద్దారు. ఇప్పటికే హువా పద్యాలు, చిత్రలేఖనం నేర్చుకుంటోందట. కోడింగ్‌లోనూ నైపుణ్యం సంపాదించడానికే ఆమెను ఈ కోర్సులో చేర్చినట్లు ఏఐ సంస్థలు వెల్లడించాయి. రోబోలాగా కాకుండా.. ఈ వర్చువల్‌ విద్యార్థిని మనిషిలాగే ఇతరులను పరిచయం చేసుకొని చక్కగా మాట్లాడగలదట. మనిషిలాగే ఆలోచిస్తూ.. భావోద్వేగాలనూ పలికించగలదని సింఘువా వర్సిటీ ప్రొఫెసర్‌ టాంగ్‌ జీ వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన బీఏఏఐ సమావేశంలో హువా తనకు తానుగా పరిచయం చేసుకొని తన వివరాలు వెల్లడించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని