Mangalagiri: లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ‘చీకటి కోనేరు’.. ఆ పేరెలా వచ్చిందంటే!

ప్రాచీన ఆలయాల్లో కోనేరు ఉండటం సాధారణం. దేవాలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలకు అవసరమయ్యే నీటి కోసమే కాకుండా..

Published : 05 Dec 2021 16:17 IST

మంగళగిరి: ప్రాచీన ఆలయాల్లో కోనేరు ఉండటం సాధారణం. దేవాలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలకు అవసరమయ్యే నీటి కోసమే కాకుండా.. భక్తుల పుణ్యస్నానాలు, ఉత్సవాల్లో కోనేరును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు నిర్మాణం వెనుక ఆసక్తికర కథనం ఉంది. చీకటి కోనేరుగా పిలుచుకునే ఈ కట్టడం.. ఆలయ గాలిగోపురం ఒరిగిపోకుండా సమతుల్యత కోసం నిర్మించడం ఇక్కడి విశిష్టత. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాల్లో గుంటూరు జిల్లా్లోని మంగళగిరిలో ఉన్న ఆలయం కూడా ఒకటి.  ఈ ఆలయాన్ని ద్వాపర యుగంలో పాండవులు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీకృష్ణ దేవరాయల హయాంలో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్టు చరిత్ర చెబుతోంది. 1807-09 మధ్య కాలంలో అప్పటి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు.. ఆలయం చుట్టూ ప్రహరీతోపాటు గాలిగోపురం నిర్మించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తైందిగా చెబుతారు. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తున్న ఈ గోపురం పీఠభాగాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. ఈ గోపురం నిర్మాణం పూర్తైన తర్వాత వెనుకవైపునకు ఒరుగుతున్నట్టుగా శిల్పులు గుర్తించారు. అది నిలదొక్కుకునేందుకు.. కంచి నిపుణుల సలహాతో గాలి గోపురం ఎత్తుకు సమాన లోతుతో ఎదురుగా కోనేరును తవ్వారు. లోతుగా తవ్విన కారణంగా లోపలికి దిగితే చీకటిగా ఉండేది. దీంతో ఆ కోనేరుకు చీకటి కోనేరుగా పేరొచ్చింది. 

చీకటి కోనేరులో నీరు ఎక్కువగా రావడంతో అందులోని వినాయక విగ్రహం మునిగిపోయింది. కోనేరులోని నీటిని ఆలయంలోని పూజా కార్యక్రమాలకు వినియోగించేవారు. దివిసీమ ఉప్పెన తర్వాత కోనేరు శిథిలమైపోయింది. నిర్వహణ లేకపోవడంతో.. దాని చుట్టూ గోడను నిర్మించి వదిలేశారు. ఈ ఆలయానికి సంబంధించి పట్టణంలో పెద్ద కోనేరు కూడా ఉంది. అప్పట్లో ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి చక్రస్నానంతోపాటు తెప్పోత్సవం పెద్ద కోనేరులో నిర్వహించేవారు. కోనేరులో నీరు పాడవడంతో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం నిలిపేశారు. ఈ నేపథ్యంలో చీకటి కోనేరును మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. కోనేరు శుద్ధి ప్రక్రియ చేపట్టగా.. లోపల చిన్నపాటి విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. ప్రస్తుతం కోనేరు చుట్టూ పార్కు అభివృద్ధి చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కొద్దిసేపు సేదతీరేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

కోనేరు వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో.. 1912లో నిర్మించినట్టు చూపటాన్ని చరిత్రకారులు తప్పుపడుతున్నారు. చీకటి కోనేరుతోపాటు పెద్ద కోనేరును కూడా శుద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని