కోబ్రా ఎఫెక్ట్‌: బ్రిటీష్‌ వారికి షాకిచ్చిన దిల్లీవాసులు

కోబ్రా ఎఫెక్ట్‌.. ఆర్థిక రంగం, రాజకీయాల్లో ఎక్కువగా ఉపయోగించే పదం. ఒక సమస్యను పరిష్కరించడం కోసం చేసిన ఉపాయం వల్ల ఆ సమస్య మరింత జఠిలం కావడాన్నే ‘కోబ్రా ఎఫెక్ట్‌’అని అంటారు. భారతదేశాన్ని బ్రిటీష్‌ పరిపాలిస్తున్న కాలంలో జరిగిన సంఘటనల

Published : 19 Sep 2020 13:24 IST

కోబ్రా ఎఫెక్ట్‌.. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎక్కువగా ఉపయోగించే పదం. ఒక సమస్యను పరిష్కరించడం కోసం చేసిన ఉపాయం వల్ల ఆ సమస్య మరింత జఠిలం కావడాన్నే ‘కోబ్రా ఎఫెక్ట్‌’ అని అంటారు. భారతదేశాన్ని బ్రిటీష్‌ వారు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ ‘కోబ్రా ఎఫెక్ట్‌’ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే..

దేశం బ్రిటీష్‌ పాలకుల చేతిలో ఉన్నప్పుడు దిల్లీ నగరంలో విషపూరిత పాములు సంచరించేవట. దీంతో ప్రజలు, అధికారులు భయాందోళనకు గురయ్యేవారు. వీటి బెడద తప్పించేందుకు బ్రిటిష్‌ అధికారుల్లో ఒకరు ఓ ఉపాయం ఆలోచించారు. దిల్లీ వ్యాప్తంగా పాముల బౌంటీ కార్యక్రమం ప్రారంభించారు. ఎవరైతే పామును చంపి దాని చర్మాన్ని తీసుకొస్తారో వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో ప్రజలు పాములను చంపి, వాటి చర్మాన్ని అధికారులకు అప్పగించి, సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. అలా వందల సంఖ్యలో పాముల చర్మాలతో ప్రభుత్వ కార్యాలయాలు నిండిపోయేవి. ప్రజలకు బౌంటీ కింద నగదు బహుమతి ఇస్తుండటంతో ఖజానాలో డబ్బులు కూడా తగ్గిపోతుండేవి. ఇంత చేసినా నగరంలో పాముల సంఖ్య రోజురోజుకు పెరగడమే గానీ తగ్గుదల కనిపించలేదు.

అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని బ్రిటిష్ అధికారులు దర్యాప్తు చేయగా.. వారికి దిమ్మతిరిగే విషయం బయటపడింది. నగరంలో కొందరు పాములను పెంచి పోషిస్తున్నారని తెలిసింది. వాటినే నగరంలోకి వదిలి, పట్టుకొని బౌంటీ డబ్బులు తీసుకుంటున్నారని అర్థమైంది. ఈ విషయం తెలిసి షాక్‌కు‌ గురైన అధికారులు వెంటనే బౌంటీ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పాముల్ని చంపి, చర్మం తెచ్చినా డబ్బులు ఇచ్చేది లేదని బ్రిటిష్‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో పాములను ప్రజలు అడవుల్లో వదిలేశారు. అలా బ్రిటిష్‌ ప్రభుత్వం ఉపాయం బెడిసికొట్టి సమస్యను మరింత పెంచింది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఒక సమస్యను పరిష్కరించబోయి మరింత జఠిలం చేసుకునే సందర్భాల్లో ఈ పదాన్ని వాడుతుంటారు. 

వియత్నాంలోనూ ఇలాగే..

వియత్నాంను ఫ్రాన్స్‌ పాలిస్తున్న కాలంలో కోబ్రా ఎఫెక్ట్‌లాంటి ఘటనే జరిగింది. 1902లో వియత్నాంలోని హనొయ్‌ నగరంలో ఎలుకలు విపరీతంగా ఉండేవి. దీంతో ఎలుకల్ని చంపి వాటి తోకని తీసుకొస్తే నగదు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రజలు ఎలుకల్ని చంపకుండా కేవలం వాటి తోక కత్తిరించి వదిలిపెట్టేవారు. ఆ తోకను చూపించి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకునేవారు. కొంత కాలానికి నగరంలో తోకలు లేని ఎలుకలు కనిపించడంతో ప్రభుత్వం ఆరా తీసింది. ఎలుకల్ని చంపితే వాటి సంఖ్య తగ్గిపోతుందని ప్రజలే అలా తోక కత్తిరించి వదిలేస్తున్నారని తెలిసింది. ఈ ఎలుకలు సంతానోత్పత్తి చేస్తే మరిన్ని ఎలుకలు వస్తాయి.. వాటి తోకలు కూడా కత్తిరించి డబ్బులు సంపాదించాలని ప్రజలు భావించారట. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని