అథ్లెట్ల కోసం బ్యాటరీ మాస్కులు 

భారత ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో అథ్లెట్ల కోసం బ్యాటరీ మాస్కులు అందుబాటులోకి రానున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి అయిన పియూష్‌ అగర్వాల్‌ వీటిని తయారు చేస్తున్నారు. ఈయన ఇటీవలే ప్రభుత్వం నిధులు అందించే మాస్కుల

Published : 30 Sep 2020 01:35 IST

దిల్లీ : భారత ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో అథ్లెట్ల కోసం బ్యాటరీ మాస్కులు అందుబాటులోకి రానున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి అయిన పియూష్‌ అగర్వాల్‌ వీటిని తయారు చేస్తున్నారు. ఈయన ఇటీవలే ప్రభుత్వ చేయూతతో మాస్కుల తయారీ స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించారు. ఇది ఐఐటీ దిల్లీతో అనుసంధానమై పని చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్‌ సంఘం సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌మెహతా బ్యాటరీ మాస్కుల గురించి మాట్లాడారు. ఒక్కో దాని ధర రూ.2,200 ఉంటుందని వివరించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అథ్లెట్లు సాధన చేయటానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందు కోసం ఈ మాస్కులను రూపొందిస్తున్నట్లు రాజీవ్‌ తెలిపారు. ఏ ఇతర మాస్కులు అందించనంత ఆక్సీజన్‌ను బ్యాటరీతో పనిచేసే మాస్కులు అథ్లెట్లకు అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. 
  ఈ మాస్కులకు రెండు వైపులా ఎన్‌-95 వాల్వ్‌లు ఉంటాయి. కుడి వైపు వాల్వ్‌లో ఉన్న ఫ్యాను బయటి గాలిని తీసుకొని వడబోసి శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎడమ వైపు ఉన్న మరొక వాల్వ్‌లోని ఫ్యాన్‌ వ్యక్తి వదిలిన గాలిని బయటికి పంపటానికి సాయపడుతుంది. మాస్కు బ్యాటరీలు చేతికి లేదా నడుముకు కట్టుకునే ఓ తీగకు అనుసంధానం అయి ఉంటాయి. బ్యాటరీని ఒక సారి ఛార్జ్‌ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుంది. ఒలింపిక్‌ బరిలో ఉన్న అథ్లెట్లు తొలుత ఈ మాస్కులను వాడతారు. శ్వాస తీసుకోవడంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకపోతే మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ఈ బ్యాటరీ మాస్కుల ప్రాజెక్టు విజయవంతం అయితే భారత ఒలింపిక్‌ సంఘం మాస్కుల వాడకంపై ఇతర దేశాలకు సిఫార్సు చేస్తుందని రాజీవ్‌ తెలిపారు. వీటిని అథ్లెట్లతో పాటు సాధారణ ప్రజలు కూడా వినియోగించవచ్చు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని